కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కోల్‌కతాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ కూడా రద్దయ్యింది.
దురంద్ కప్ 2024లో భాగంగా మోహన్ బగన్ వర్సెస్ ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ మధ్య జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం కోల్‌కతాలోని వివేకానంద యువ భారతి మైదానంలో ఆదివారం రాత్రి 7 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్‌ను ప్రస్తుత పరిస్థితుల కారణంగా రద్దు చేస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు.

రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో మ్యాచ్ సందర్భంగా అవాంచనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నామని తమ ప్రకటనలో తెలిపారు. ఈ మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులు.. హత్యాచారానికి గురైన డాక్టర్‌కు మద్దతుగా ప్లకార్డ్స్, టీషర్ట్స్ ధరించి మ్యాచ్‌కు హాజరయ్యేందుకు సిద్దమయ్యారనే సమాచారం తమకు అందిందని చెప్పారు.
ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయడం లేదని, ఇరు జట్లు పాయింట్స్‌ను షేర్ చేసుకుంటాయని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేసిన వారికి డబ్బులు రిఫండ్ చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఇరు జట్లకు చెరొక పాయింట్ దక్కడంతో ఈస్ట్ బెంగాల్ 7 పాయింట్స్‌తో గ్రూప్ దశను ముగించింది. మోహన్ బగన్ టీమ్ కంటే ఒక గోల్ తక్కవగా చేయడంతో రెండో స్థానానికి పరిమితమైంది. వారం రోజుల క్రితం కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ ఆసుపత్రిలో యువ వైద్యురాలిని అత్యంత దారుణంగా లైంగిక దాడి జరిపి హతమార్చారు.