జూలు విదిల్చిన రొనాల్డో.. పోర్చుగల్‌కు గోల్స్ జాతర!
ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు జూలు విదిల్చాడు. అద్వితీయమైన ప్రదర్శనతో పోర్చుగల్‌కు భారీ విజయాన్ని అందించాడు. నాకౌట్ దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రొనాల్డో అదరగొట్టాడు. తనపై వచ్చిన విమర్శలకు గోల్స్‌తోనే సమాధానమిచ్చాడు.
ఫిపా ప్రపంచకప్ 2026లో భాగంగా బుధవారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్-కే మ్యాచ్‌లో పోర్చుగల్ 5-0 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్‌తో మెరిసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో డీఆర్ కాంగోతో పోర్చుగల్ డ్రా చేసుకోవడంతో రొనాల్డోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రొనాల్డో జట్టుకు భారంగా మారాడని, అతని పనైపోయిందని పలువురు మాజీ ఆటగాళ్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ రొనాల్డో తన అద్వితీయమైన ఆటతీరుతో ఫామ్ టెంపరరీ.. క్లాస్ పర్మినెంట్ అనే విషయాన్ని చాటి చెప్పాడు.
రొనాల్డో వరల్డ్ రికార్డ్..
ఈ డబుల్ గోల్ ప్రదర్శనతో రొనాల్డో వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఆరు విభిన్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ల్లో (2006, 2010, 2014, 2018, 2022, 2026) గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 96 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే మరే ఆటగాడు 6 విభిన్న ప్రపంచకప్‌ల్లో గోల్స్ నమోదు చేయలేదు. అలాగే 10 గోల్స్‌తో పోర్చుగల్ తరఫున వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన యుసేబియో రికార్డును బద్దలు కొట్టాడు. 41 ఏళ్ల 138 రోజుల వయసున్న రొనాల్డో.. రోజర్ మిల్లా (42 ఏళ్లు) తర్వాత ప్రపంచకప్‌లో గోల్ చేసిన రెండో అత్యంత వృద్ధ ఆటగాడిగా నిలిచాడు.

ఖాతా తెరిచిన రొనాల్డో..
మ్యాచ్ ప్రారంభమైన 6వ నిమిషంలోనే జోవావ్ కాన్సెలో అందించిన పాస్‌ను రొనాల్డో అద్భుతమైన ఫస్ట్‌టైమ్ ఫినిషింగ్‌తో గోల్‌గా మలిచి ఖాతా తెరిచాడు. 17వ నిమిషంలో ఉజ్బెకిస్తాన్ డిఫెన్స్‌ను బోల్తా కొట్టిస్తూ.. రొనాల్డో డెకాయ్‌గా నిలవగా.. నునో మెండిస్ సూపర్ ఫ్రీ-కిక్‌తో పోర్చుగల్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.
ఉజ్బెకిస్తాన్ చేసిన ఒక గోల్‌ను VAR ఫౌల్‌గా ప్రకటించిన వెంటనే.. బ్రూనో ఫెర్నాండెజ్ ఇచ్చిన అద్భుతమైన త్రూ-బాల్‌ను రొనాల్డో నెట్‌లోకి పంపి పోర్చుగల్ ఆధిక్యాన్ని 3-0తో ట్రిపుల్ చేశాడు.
ఉజ్బెకిస్తాన్ సెల్ఫ్ గోల్‌తో..
సెకండాఫ్‌లో ఉజ్బెకిస్తాన్ గోల్ కీపర్ అబ్దువోఖిద్ నెమటోవ్ సెల్ఫ్ గోల్ చేయడంతో పోర్చుగల్ 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట చివర్లో 87వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ రాఫెల్ లియావో బుల్లెట్ షాట్‌తో ఐదో గోల్ పూర్తి చేశాడు. రొనాల్డోకు హ్యాట్రిక్ సాధించే అవకాశాలు వచ్చినప్పటికీ ప్రత్యర్థి గోల్ కీపర్ అడ్డుకున్నాడు. మొత్తంగా 17 షాట్లతో విరుచుకుపడిన పోర్చుగల్.. ఉజ్బెకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. పూర్తి ఆధిపత్యం చెలాయించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

