ప్రతిష్టాత్మక కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా 2-0తో కెనడాను చిత్తు చేసింది. దిగ్గజ ప్లేయర్ లియోనల్ మెస్సీ అద్భుత గోల్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇది మెస్సీకి 109వ అంతర్జాతీయ గోల్. ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో(130) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కెనడాతో మ్యాచ్‌లో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆఖరి వరకు బంతిపై నియంత్రణ కొనసాగించింది. కెనడా గోల్ పోస్ట్‌పై పదే పదే దాడులు చేసింది. 22వ నిమిషంలో జులియన్ అల్వారెజ్ అద్భుత గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచింది. పెనాల్టీ ప్రదేశం నుంచి అతను మెరుపు కిక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఆ బంతి గోల్ కీపర్ మధ్యలో నుంచి నెట్‌లోకి వెళ్లిపోవడం గమనార్హం.

ఆ గోల్ అనంతరం మరింత దూకుడుగా ఆడిన అర్జెంటీనా.. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ముప్పు తిప్పలు పెట్టింది. ముఖ్యంగా డ్రిబ్లింగ్ నైపుణ్యాలతో మెస్సి అభిమానులను అలరించాడు. సెకండాఫ్ గేమ్‌లో 51వ నిమిషంలో మెస్సి అద్భుతంగా గోల్ సాధించాడు.
గోల్ పోస్ట్‌కు సమీపంలో నుంచే అతను బంతిని లోపలికి పంపించాడు. ఈ గోల్‌తో అర్జెంటీనా విజయాన్ని ఖాయం చేశాడు. ఆ తర్వాత కెనడా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అర్జెంటీనా తరఫున గత 25 మ్యాచ్‌ల్లో మెస్సి 28 గోల్స్ నమోదు చేశాడు. కోపా అమెరికా టోర్నీలో అతనికి ఇది 14వ గోల్ కావడం విశేషం. అర్జెంటీనా జట్టుకు ఇది వరుసగా పదో విజయం.
కొలంబియా విజయం..
మరో సెమీఫైనల్లో కొలంబియా 1-0తో ఉరుగ్వేను చిత్తు చేసింది. గురువారం తెల్లవారు జామున జరిగిన ఈ రెండో సెమీఫైనల్లో కొలంబియా మిడ్ ఫీల్డర్ జెఫెర్సన్ లెర్మా ఏకైక గోల్ చేసి కొలంబియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 39వ నిమిషంలో అతను గోల్ సాధించాడు. సోమవారం అర్జెంటీనా వర్సెస్ కొలంబియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.