Euro 2020: ఇటలీ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ ఫ్యాన్స్ రచ్చ.. జాతి వివక్ష వ్యాఖ్యలు.. బ్రిటన్ ప్రధాని ఫైర్

లండన్: 55 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుందని, యూరో 2020 టైటిల్‌ను ఇంగ్లండ్ ముద్దాడుతుందని భావించిన ఆ జట్టు ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇటలీతో జరిగిన యూరోకప్ ఫైనల్లో ఇంగ్లండ్ త్రుటిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్కోర్లు 1-1తో సమం కావడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. అందులో ఇటలీ 3-2 తేడాతో విజయం సాధించింది. దాంతో ఇంగ్లండ్ అభిమానుల అల్లరి శృతి మించింది. స్టేడియం నుంచి బయటికి వెళ్లే దారిలో ఇటలీ అభిమానులపై పిడిగుద్దులు కురిపించారు. వారి జాతీయ పతాకాన్ని అవమానపరిచారు. అలాగే నల్లజాతీయులు కనిపించినా వదల్లేదు. ఇక వీధుల్లో వీరంగానికి అంతే లేకుండా పోయింది. ఈ ఘర్షణలో అటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

జాతి వివక్ష వ్యాక్యలు..
దీనికి తోడు పెనాల్టీ షూటౌట్‌లో చివరి మూడు గోల్స్‌ను విఫలం చేసిన మార్కస్ రాష్‌ఫోర్డ్, జేడన్ సాంచో, బుకాయో సకా నల్ల జాతీయులు కావడంతో వారిపై వర్ణవివక్ష దాడికి దిగారు. సోషల్ మీడియాలో ఈ త్రయాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఫుట్‌బాల్ వర్గాల నుంచే కాకుండా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, మాజీ క్రికెటర్లంతా ఆ ముగ్గురు ఆటగాళ్లకు మద్దతు పలికాడు. వారంతా ఇంగ్లండ్ జట్టు హీరోలని కొనియాడారు. అటు పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

బ్రిటన్ ప్రధాని ఫైర్..
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్రీడాకారులపై జాతివివక్ష వ్యాఖ్యలను ప్రధాని బోరిస్ జాన్సన్ ఖండించారు. ఓడిపోయిన వారిని అలా నిందించడం దుర్మార్గ చర్యగా వర్ణించారు. ఇలాంటి ప్రవర్తనకు తమకు తామే సిగ్గుపడాలని విమర్శించారు. 'జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినవారు తమకు తామే సిగ్గుపడాలి' అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు. ఆటగాళ్లపై దూషణ సహించరానిది, ఇది కచ్చితంగా దుష్ప్రవర్తనే అని ఇంగ్లండ్ ఫుట్‌బాల్ సంఘం ప్రకటించింది. తిట్టడం ఆమోదయోగ్యం కాదంటూ లండన్ పోలీసులు అన్నారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన వారిపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

పీటర్సన్ ఘాటు విమర్శలు
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సైతం జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారిని ఘాటుగా విమర్శించారు. 'రాత్రి ఇంటికి వెళ్లేందుకు కారు తీసినప్పుడు చాలా భయమేసింది. అదో భయానక దృశ్యం! 2021లో ఇలాంటి ప్రవర్తనా? ఆటగాళ్లను తిడితే మనకు ఆనందం కలుగుతుందా? 2030 ప్రపంచకప్‌నకు మనం అర్హులమేనా?' అని పీటర్సన్ ప్రశ్నించాడు. 'బ్రిటన్‌లోని మీడియా బహుశా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైంది. దూషణలకు దిగిన వారి ఖాతాలను తనిఖీ చేసేలా సోషల్ మీడియాపై ఒత్తిడి చేసే బాధ్యత వారిదే. ఇవేవీ రోబోట్స్ చేసినవి కావు! నకిలీ ఖాతాలూ కావు! బాధ్యత అందరికీ ఉంది. ఈ ప్రవర్తన సమాజాన్ని దిగజారుస్తోంది' అని మరో ట్వీట్లో అన్నాడు.

ఫేస్‌బుక్, ట్విటర్‌పై విమర్శలు..
ఆటగాళ్లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేస్తూ దూషణకు దిగడాన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ అడ్డుకోవడంలో విఫలమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అసభ్యరమైన పోస్ట్‌లు ఎప్పటికప్పుడూ తొలగించడం, సదరు ఖాతాలను బ్లాక్ చేయడంలో ఈ టెక్ కంపెనీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ వివక్ష వ్యాఖ్యల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం సైతం ఫెస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాలపై కన్నెర్ర చేసింది. సోషల్ మీడియా కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరోవైపు అసభ్యకర పోస్ట్‌లను ఎప్పటికప్పుడూ తొలిగిస్తున్నామని ట్విటర్, ఫేస్‌బుక్ ప్రకటించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications