గట్టెక్కిన బ్రెజిల్.. ముచ్చెమటలు పట్టించిన జపాన్
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఐదు సార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్‌కు పసికూన జపాన్ ముచ్చెమటలు పట్టించింది. సోమవారం అర్థరాత్రి హోరాహోరీగా సాగిన నాకౌట్ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1 గోల్స్ తేడాతో గట్టెక్కింది. ఒక దశలో వెనుకబడిన బ్రెజిల్.. ఆఖరి నిమిషాల్లో లభించిన అవకాశాన్ని గోల్‌గా మలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా.. జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఫస్టాఫ్‌లో చెలరేగిన జపాన్..
మ్యాచ్ ఆరంభంలో బ్రెజిల్ ఆటగాళ్లు మథ్యూస్ కున్హా, బ్రూనో గుమారేస్ జపాన్ డిఫెన్స్‌ను ఛేదించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఆట 29వ నిమిషంలో బ్రెజిల్ డిఫెండర్ డానిలో చేసిన తప్పును అనుకూలంగా మార్చుకున్న జపాన్ మిడ్‌ఫీల్డర్ కైషు సానో.. బ్రెజిల్ రక్షణ శ్రేణిని ఛేదిస్తూ అద్భుతమైన గ్రౌండ్ షాట్‌తో గోల్ కొట్టాడు. దీంతో ఫస్టాఫ్ ముగిసేసరికి జపాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

కాసిమిరో హెడర్ గోల్..
సెకండాఫ్‌లో బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలోట్టి వ్యూహాలు మార్చారు. బ్రెజిల్ ఆటగాళ్లు జపాన్ గోల్ పోస్ట్‌పై వరుస దాడులు చేశారు. ఈ క్రమంలో 56వ నిమిషంలో గాబ్రియేల్ మాగల్హాస్ అందించిన అద్భుత పాస్‌ను సీనియర్ ఆటగాడు కాసిమిరో హెడర్ ద్వారా గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత వినీషియస్ జూనియర్ కొట్టిన ఒక షాట్ పోస్ట్‌కు తగిలి వెనుదిరిగింది.
ఇంజూరీ టైమ్‌లో మార్టినెల్లీ సంచలనం
మ్యాచ్ ఇంజూరీ టైమ్ (95వ నిమిషం)లో బ్రెజిల్ ఊహించని షాకిచ్చింది. జపాన్ బాక్స్ బయట బంతిని చేజిక్కించుకున్న బ్రూనో గుమారేస్, ప్రత్యామ్నాయ ఆటగాడిగా వచ్చిన గాబ్రియేల్ మార్టినెల్లీకి పాస్ ఇచ్చాడు. మార్టినెల్లీ ఏమాత్రం తప్పు చేయకుండా బంతిని నెట్‌లోకి పంపి బ్రెజిల్ క్యాంప్‌లో సంబరాలు నింపాడు.
గుమారేస్ అరుదైన రికార్డ్
ఈ గోల్‌తో బ్రెజిల్ 2-1తో విజయం సాధించి తదుపరి రౌండ్‌లో ఐవరీ కోస్ట్ లేదా నార్వేతో తలపడటానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో అసిస్ట్ అందించిన గుమారేస్, ఈ ప్రపంచకప్‌లో అత్యధిక అసిస్ట్‌లు (4) అందించిన ఆటగాడిగా నిలిచాడు. బ్రెజిల్ తరఫున ఒకే ప్రపంచకప్‌లో దిగ్గజ పీలే (1970లో 6 అసిస్ట్‌లు) తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

