సెనెగల్‌పై చారిత్రాత్మక విజయం.. ప్రిక్వార్టర్స్‌కు బెల్జియం!
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో బెల్జియం సంచలన విజయాన్ని నమోదు చేసింది. గురువారం తెల్లవారుజామున జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో బెల్జియం 3-2 తేడాతో సెనెగల్‌ను ఓడించి ప్రి-క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
ఒకానొక దశలో 0-2తో వెనుకబడిన బెల్జియం.. అద్వితీయమైన ప్రదర్శనతో పుంజుకొని చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఎక్స్‌ట్రా టైమ్ ఆఖరి నిమిషంలో కెప్టెన్ యూరి టీల్‌మన్స్ పెనాల్టీ గోల్‌తో బెల్జియం విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
సెనెగల్ జోరు.. బెల్జియం బేజారు
మ్యాచ్ ఆరంభం నుంచి సెనెగల్ తమ దూకుడుతో బెల్జియం డిఫెన్స్‌ను ముప్పు తిప్పలు పెట్టింది. ఆట 25వ నిమిషంలో హబీబ్ దియారా గోల్ చేసి సెనెగల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. సెకండాఫ్ మొదలైన ఆరు నిమిషాలకే (51వ నిమిషంలో) ఇస్మాయిలా సార్ మరో అద్భుతమైన గోల్‌తో స్కోరును 2-0కు పెంచాడు. ఈ ప్రపంచకప్‌లో సార్‌కు ఇది నాలుగో గోల్. బెల్జియం స్టార్ ఆటగాళ్లు కెవిన్ డి బ్రూయిన్, జెరెమీ డోకులను కోచ్ బయటకు రప్పించడంతో ఆ జట్టు ఓటమి ఖాయమని అందరూ భావించారు.

చివరి 4 నిమిషాల్లో మ్యాజిక్
ఆట 86వ నిమిషం వరకు సెనెగల్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రొమేలు లుకాకు 86వ నిమిషంలో క్లోజ్-రేంజ్ గోల్‌తో బెల్జియం ఖాతా తెరిచాడు. దాంతో బెల్జియం శిభిరంలో ఆశలు చిగురించాయి. సరిగ్గా మూడు నిమిషాల తర్వాత (89వ నిమిషంలో) సెనెగల్ గోల్‌కీపర్ మోరీ దియావ్ చేసిన పొరపాటును అనుకూలంగా మార్చుకుంటూ యూరి టీల్‌మన్స్ హెడర్ ద్వారా గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు.
ఎక్స్‌ట్రా టైమ్‌లో టీల్‌మన్స్ రికార్డు గోల్
నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు సమంగా ఉండటంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఎక్స్‌ట్రా టైమ్ చివరి నిమిషంలో (125వ నిమిషంలో) బెల్జియం కెప్టెన్ టీల్‌మన్స్‌ను సెనెగల్ డిఫెండర్ లామిన్ కమారా ఫౌల్ చేయడంతో, సుదీర్ఘ VAR సమీక్ష అనంతరం రెఫరీ పెనాల్టీ ప్రకటించారు. ఒత్తిడిని అధిగమిస్తూ టీల్‌మన్స్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి బెల్జియంకు 3-2తో అద్భుత విజయాన్ని అందించాడు. ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలో రెండు గోల్స్ వెనుకబడి ఉండి కూడా మ్యాచ్ గెలవడం బెల్జియంకు ఇది రెండోసారి (గతంలో 2018లో జపాన్‌పై). తదుపరి రౌండ్‌లో బెల్జియం.. అమెరికాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

