ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మెస్సీ దూరం!
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ వరుస విజయాలతో జోరు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సిద్దమైంది. శనివారం (నేడు) అర్థరాత్రి జరిగే గ్రూప్-జే మ్యాచ్‌లో జోర్డాన్‌తో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే అర్జెంటీనా నాకౌట్ దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
దాంతో జోర్డాన్‌తో పోరు అర్జెంటీనాకు నామమాత్రమే కావడంతో ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ మ్యాచ్ నుంచి మెస్సీకి విశ్రాంతి ఇవ్వాలని కోచ్ లియోనెల్ స్కలోని నిర్ణయించారు. ఈ వారమే 39 ఏళ్లు పూర్తి చేసుకున్న మెస్సీ.. జోర్డాన్‌తో మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
సూపర్ ఫామ్‌లో మెస్సీ.. అయినా రెస్ట్ ఎందుకు?
ఈ మెగా టోర్నీలో అర్జెంటీనా ఇప్పటివరకు చేసిన మొత్తం 5 గోల్స్ మెస్సీ ఖాతాలోనే పడటం విశేషం. అంతేకాకుండా అత్యధికంగా 22 ప్రోగ్రెసివ్ క్యారీలు, 11 లైన్-బ్రేకింగ్ పాస్‌లతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 18 గోల్స్ చేసిన ఆటగాడిగా మిరోస్లావ్ క్లోజ్, కిలియన్ ఎంబాప్పేలను అధిగమించి మెస్సీ సరికొత్త రికార్డు సృష్టించాడు.

అయినప్పటికీ తదుపరి దశ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని మెస్సీకి విశ్రాంతి ఇస్తున్నట్లు కోచ్ స్కలోని స్పష్టం చేశారు. 'నేటి మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ సబ్‌స్టిట్యూట్‌గా ఉంటాడు. అవసరమైతేనే ఆఖర్లో మైదానంలోకి వస్తాడు. తదుపరి రౌండ్‌లో మేం ఎదుర్కొబోయే ప్రత్యర్థిని బట్టి ఈ నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసమే అతనికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాం.'అని డల్లాస్ స్టేడియంలో జరిగిన ప్రెస్ మీట్‌లో కోచ్ పేర్కొన్నారు.
అదే జోరు కొనసాగిస్తాం..
మెస్సీ బెంచ్‌పై ఉన్నా జట్టు ప్రదర్శనలో ఎలాంటి మార్పు ఉండబోదని స్కలోని ధీమా వ్యక్తం చేశారు. "ఈ జెర్సీ వేసుకుని మైదానంలోకి దిగినప్పుడు పాయింట్లు అవసరమా లేదా అన్నది ముఖ్యం కాదు. ఎల్లప్పుడూ గెలవడమే మా లక్ష్యం. జోర్డాన్‌ను మేం తక్కువగా అంచనా వేయడం లేదు. మ్యాచ్‌పై నియంత్రణ సాధించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తాం' అని చెప్పారు. అర్జెంటీనా ప్రస్తుతం ప్రపంచకప్‌లో వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. ఒకే కోచ్ పర్యవేక్షణలో అర్జెంటీనాకు ఇదే అత్యుత్తమ రికార్డు.
మరోవైపు, ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన జోర్డాన్ (68వ ర్యాంక్) ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. గతంలో 2018లో జర్మనీని ఓడించిన సౌత్ కొరియా (57వ ర్యాంక్) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత లాస్ట్-32 దశలో టోర్నీ డెబ్యూటెంట్ 'కేప్ వెర్డే' జట్టుతో అర్జెంటీనా తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

