అందుకే ఓడిపోయాం.. లేకుంటే గెలిచేవాళ్లం: జింబాబ్వే కెప్టెన్

హరారే: బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే భారత్‌తో రెండో వన్డేలో ఓటమిపాలయ్యామని జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చకబ్వా అన్నాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని, ఇంకొన్ని పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ ఓటమి అనంతరం మాట్లాడిన చకబ్వా.. తదుపరి గేమ్‌లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.
'ఈ మ్యాచ్‌లో మేం గట్టి పోటీనిచ్చాం. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆరంభంలో వికెట్లు తీయడంలో మేం తడబడ్డాం. కానీ ఈ మ్యాచ్‌లో ఆ సమస్యను అధిగమించాం. బ్యాటింగ్‌లో మేం విఫలమయ్యాం. ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. భారత్‌కు గట్టి సవాల్ విసిరాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేశారు.'అని చకబ్వా చెప్పుకొచ్చాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 38.1 ఓవర్లలోనే 161 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి కనీసం 50 ఓవర్లు కూడా క్రీజులో నిలవలేకపోయింది. ఆ జట్టులో సీన్ విలియమ్స్(42), ర్యాన్ బర్ల్(39 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 25.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. తొలి వన్డే మాదిరి నిదానంగా ఆడకుండా దూకుడుగా ఆడిన భారత్ 154 బంతుల్లోనే విజయాన్నందుకుంది. మరోసారి శిఖర్ ధావన్(21 బంతుల్లో 4 ఫోర్లతో 33), శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 6 ఫోర్లతో 33) ఫర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్(1), ఇషాన్ కిషన్(6) విఫలమవ్వగా.. దీపక్ హుడా(25) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో లూక్ జాంగ్వే రెండు వికెట్లు తీయగా.. తానక చివంగా, విక్టర్ న్యూచి, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications