
హామిల్టన్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సరదా ట్వీట్లు, జోకులతో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఇక చాహల్ టీవీ అంటూ అతను చేసే హడావిడి అంత ఇంత కాదు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న చాహల్.. మొన్న రెండో టీ20 అనంతరం మైదానంలో గప్తిల్, రోహిత్ శర్మ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా.. వారి మధ్యలో దూరి ఏం జరుగుతోందని ప్రశ్నించాడు.
దీంతో గప్తిల్ హిందీలో అనకూడని ఓ మాట అనడంతో పక్కనే ఉన్న రోహిత్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. ఇదంతా రికార్డవ్వడంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. ఇక నిన్న ధోని లెజెండ్ సీటంటూ బస్సులో చేసిన ఓ వీడియోలో..ఎంఎస్ ధోనీని ఎంతో మిస్ అవుతున్నామని, అతడి స్థానాన్ని అలానే ఉంచుతున్నామని తెలిపాడు.
తాజాగా తన షాట్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ కాపీ కొడుతున్నారంటూ సరదాగా ట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్టు నెట్టింట వైరలైంది. అభిమానులు సరదా కామెంట్లు, ఫన్నీ మీమ్స్‌తో బదులిస్తున్నారు.
ఇంతకీ.. చాహల్ చేసిన ట్వీట్‌లో ఏం ఉందంటే.. అప్పర్‌కట్ ఆడుతున్న కోహ్లీ, రాహుల్ ఫొటోలకు.. అదే షాట్‌తో తాను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పిక్‌ను జతచేసి ట్వీట్ చేశాడు. దీనికి 'వారు(కోహ్లీ, రాహుల్) నా షాట్‌ను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.. తప్పులేదు మీరింకా యువకులే.. కానీవ్వండి'అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చాడు. నవ్వులు పూయించేలా ఉన్న ఈ పోస్టు క్షణాల్లో వైరలైంది. అబ్బో... అబ్బా చా.. అంతేనా.! అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే గప్తిల్ తిట్టిన తిట్టును గుర్తుచేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
మూడు వారాల సుదీర్ఘ పర్యటనకు న్యూజిలాండ్‌కు వెళ్లిన భారత జట్టు అద్భుతంగా ఆడుతుంది. 5 టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు గెలిచి సిరీస్‌పై కన్నేసింది. హమిల్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లోఆతిథ్య జట్టుకు భారత్ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్ భారత్ సొంతమవుతోంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు గత మ్యాచ్ ప్రదర్శనను రిపీట్ చేస్తే భారత్ గెలవడం ఖాయం.