29 బంతుల్లో సెంచరీ.. ఏబీ డివిలియర్స్ రికార్డ్‌ను బద్దలకొట్టిన చాహల్
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా అద్భుతాలు చేయగలనని నిరూపించాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ విసిరిన వినూత్న బ్యాటింగ్ ఛాలెంజ్‌ను స్వీకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టడి చేసే చహల్.. ఈసారి బ్యాట్‌తో బంతిని బౌండరీ బయటకు పంపించాడు.
కేవలం 50 బంతుల్లోనే 100 పరుగులు చేయాలని, బౌలింగ్ గంటకు 81 కిలోమీటర్ల వేగంతో మొదలై.. ప్రతీ బంతికి ఒక మైలు చొప్పున పెరుగుతుందని పీటర్సన్ సవాల్ విసిరాడు. అంతేకాకుంబా బౌండరీ దూరాన్ని 40 మీటర్లకు తగ్గించాడు. ఈ వినూత్న నిబంధనలతో సాగిన ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది.
సిక్సర్‌తో మొదలు..
తొలి బంతికే సిక్సర్ బాదిన చాహల్.. రెండో బంతిని కూడా సిక్సర్ తరలించాడు. అయితే మూడో బంతికి క్యాచ్ ఇవ్వగా ఫీల్డర్ వదిలేసాడు. ఈ అవకాశంతో చాహల్ చెలరేగాడు. అతని షాట్లకు పీటర్సన్ అవాక్కయ్యాడు. 8వ బంతికి చాహల్ ఔటైనప్పటికీ.. రూల్స్ ప్రకారం ఔటైనప్పుడు తిరిగి బ్యాటింగ్ చేసేందుకు అతని స్కోర్ నుంచి ఐదు పరుగులు తగ్గించారు. దాంతో చాహల్ స్కోర్ 26 పరుగులకు పడిపోయింది. 10 బంతులు ముగిసే సరికి చాహల్ 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన చాహల్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ హాఫ్ సెంచరీని చాహల్ తనదైన శైలిలో సెలెబ్రేట్ చేసుకున్నాడు. పీటర్సన్ సైతం అతన్ని కౌగిలించుకొని అభినందించాడు.

29 బంతుల్లో సెంచరీ..
ఆ తర్వాత 16వ బంతికి మరో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో చహల్ అవుటయ్యారు. దీనితో మరొక ఐదు పరుగులు కోల్పోవాల్సి వచ్చింది. 20వ బంతి ముగిసే సమయానికి చహల్ స్కోరు 56 పరుగుల వద్ద ఉంది. ఆ తర్వాత వరుస సిక్సర్లతో విరుచుకుపడి కేవలం 25 బంతుల్లోనే 90 పరుగుల మార్కును అందుకున్నాడు. చివరకు 29వ బంతిని ఆకాశమే హద్దుగా సిక్సర్ బాదిన చహల్ శతకం పూర్తి చేసుకున్నాడు.
ఈ క్రమంలో సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న పాత రికార్డును చహల్ అధిగమించాడు. ఈ సవాలును పూర్తి చేయడానికి చహల్ ఏకంగా 17 సిక్సర్లు కొట్టాడు. ఇంకా 21 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్‌లో ఫ్లాప్ షో
ఈ సరదా సవాల్‌ను చాహల్ గెలిచినప్పటికీ.. ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను తీవ్రంగా నిరాశపర్చాడు. 12 ఇన్నింగ్స్‌లో కేవలం 12 వికెట్లు మాత్రమే తీసాడు. పంజాబ్ కింగ్స్ తరఫున రెండు సీజన్లు ఆడిన చాహల్ మొత్తం 28 వికెట్లు తీసాడు. ఈ సీజన్‌లో అతని వైఫల్యం పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది.
భారత జట్టు తరఫున చాహల్ 2023లో చివరి మ్యాచ్ ఆడాడు. యువ స్పిన్నర్లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేస్తుండటంతో చాహల్‌కు అవకాశం లేకుండా పోయింది. భారత జట్టుకు దూరమైన చాహల్.. కౌంటీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ ఆడటం ద్వారా తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవచ్చనే యోచనలో చాహల్ ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

