న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తనదైన శైలిలో స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఏమోజీలతోనే తన బాధను వ్యక్తం చేసిన చాహల్.. సెలెక్టర్లతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సవాల్ విసిరాడు. కారు మబ్బులను చీల్చుచుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడని ఏమోజీలతో గుర్తు చేశాడు.
తాను కూడా నేలకు కొట్టిన బంతిలా జట్టులోకి దూసుకొస్తానని సవాల్ విసిరాడు. ఆసియాకప్ 2023 కోసం ఎంపిక చేసిన జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అగార్కర్ వెల్లడించాడు.

తెలుగు తేజం తిలక్ వర్మ ఈ జట్టులో చోటు దక్కించుకోగా.. గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు.ఐర్లాండ్ పర్యటనలో పునరాగమనం చేసిన జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణలు కూడా ఆసియాకప్‌కు ఎంపికయ్యారు. వన్డేల్లో మెరుగైన రికార్డులేని సూర్య కుమార్ యాదవ్‌కు కూడా చోటు దక్కింది. ఆశ్చర్యకరంగా యుజ్వేంద్ర చాహల్‌పై వేటు వేసిన సెలెక్టర్లు అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటిచ్చారు.
యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వెల్లడించాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయడం కోసం ఓ రిస్ట్ స్పిన్నర్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు. చాహల్ కంటే కుల్దీప్ యాదవ్ మెరుగ్గా రాణిస్తుండటంతో అతనికి అవకాశం దక్కిందని స్పష్టం చేశాడు.
'అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు బ్యాట్‌తో కూడా సత్తా చాటగలడు. కుల్దీప్ యాదవ్ కూడా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను ఎంచుకోవడం కష్టం. అందుకే కుల్దీప్ యాదవ్‌నే ఎంపిక చేశాం.'అని అగార్కర్ తెలిపాడు.
ఇక రోహిత్ శర్మ మాట్లాడుతూ.. యుజ్వేంద్ర చాహల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లకు ఇంకా టీమిండియా డోర్స్ తెరిచే ఉన్నాయని స్పష్టం చేశాడు. 'చాహల్ కోసం ఓ పేసర్‌ను పక్కన పెట్టలేని పరిస్థితి. ఆసియాకప్ 2023 జట్టులో 17 మందికి మాత్రమే చోటుంది. అందుకే యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకోలేకపోయాం.
అతనితో పాటు రవి అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లకు ప్రపంచకప్ దారులు మూసుకుపోలేదు. పరిస్థితులకు తగ్గట్లు వారిని జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. చాహల్ సెటైరికల్ పోస్ట్‌ను అభిమానులు రోహిత్ శర్మ గతంలో చేసిన ట్వీట్‌తో పోల్చుతున్నారు. 2018లో టీమిండియాలో చోటు కోల్పోయినప్పుడు రోహిత్ కూడా.. సూర్యుడు ఉదయిస్తాడని ట్వీట్ చేశాడు.