న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రశంసల జల్లు కురిపించాడు. కింగ్ ఒక్కడే ఉంటాడని, క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీనే అని చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నదమవుతుందని చెప్పిన చాహల్.. టీమ్ చాలా బలంగా ఉందని చెప్పాడు.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ చిట్ చాట్‌కు సతీమణి ధనశ్రీ వర్మతో కలిసి హాజరైన యుజ్వేంద్ర చాహల్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2021లో చోటు దక్కకపోవడంతో తీవ్రంగా ఏడ్చేశానని గుర్తు చేసుకున్నాడు. 'నాకు బాధొచ్చినా.. దుఃఖం వేసినా వెంటనే ఏడ్చేస్తా. లేదంటే ఆ బాధ నన్ను మరింత కుంగదీస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక కాకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటిదాకా నేను టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నా. అయినా వరల్డ్ కప్‌కు ఎంపిక కాకపోవడంతో తీవ్ర బాధకు గురి చేసింది. ఆ బాధను భరించలేక బాత్‌రూమ్‌కి వెళ్లి ఏడ్చేశా. ఆ సమయంలో ధనశ్రీ నాతో ఉంది.
తర్వాతి రోజు ఫ్లైట్ ఎక్కి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేందుకు దుబాయ్ వెళ్లాలి. వారం రోజులు క్వారంటైన్‌లో ఉన్నాం. పరిస్థితులు బాగుంటే బయటికి వెళ్లి, అలా ఇలా తిరిగి ఏదోలా మరిచిపోయేవాడిని. వారం రోజులు అలా రూమ్‌లో కూర్చోవాలంటే చాలా భయమేసింది. దేవుడి దయ వల్ల ధనశ్రీ నాతో ఉండటంతో ఆ బాధ నుంచి బయటపడ్డాను.
ఆమె ఎదలో సేద తీరి నా కోపాన్ని, బాధను అణుచుకున్నాను. ఆమె లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. మేం ఇద్దరం కలిసి ఎక్సర్‌సైజ్ చేసేవాళ్లం.. సినిమాలు చూస్తూ రిలాక్స్ అయ్యేవాళ్లం. అయినా అప్పుడు నేను ఆర్‌సీబీలో ఉన్నా. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే నా కెప్టెన్. అయినా నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు అర్థం కాలేదు..
నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదో ఎవరినీ అడగలేదు. అడగాలని కూడా అనిపించలేదు. జరిగిందేదో జరిగిపోయింది, ఐపీఎల్‌పైన ఫోకస్ పెట్టమని ధనశ్రీ చెప్పింది. నా కోపాన్ని గ్రౌండ్‌లోనే చూపించమని సలహా ఇచ్చింది. తను చెప్పిందే నిజమని అనిపించింది. నా క్రికెట్ కెరీర్‌లో అవి చీకటి రోజులు.'అని ధన శ్రీ చెప్పుకొచ్చాడు.