రోహిత్ శర్మ వల్లే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశా.. అతని రాకతో ఆర్‌సీబీ సమస్యలు తీరాయి: యుజ్వేంద్ర చాహల్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వల్లే తాను ఐపీఎల్‌లో అరంగేట్రం చేశానని స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. రోహిత్ శర్మ తనకు అన్నలాంటివాడని, అతనితో బంధం విడదీయరానిదని తెలిపాడు. ఇక 2013 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన చాహల్.. రోహిత్ శర్మ చొరవతో మ్యాచ్ ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. ఆ సీజన్‌లో తొలిసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హిట్‌మ్యాన్.. సీనియర్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా జట్టులో ఉన్నా.. చాహల్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. అక్కడి నుంచి చాహల్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాతి సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చాహల్.. సూపర్ పెర్ఫామెన్స్‌తో స్టార్ స్పిన్నర్‌గా ఎదిగి అటు టీమిండియా.. ఇటు ఆర్‌సీబీలో కీలక బౌలరయ్యాడు.

రోహిత్ బ్రో వల్లే..
తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్.. రోహిత్ శర్మతో ఉన్న బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'రోహిత్ భయ్యాతో నాకు మంచి అనుబంధం ఉంది. 2013లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి మేమిద్దరం ఒకరికొకరు తెలుసు. అతని వల్లే నేను ఐపీఎల్‌లో అరంగేట్రం చేయగలిగా. నాకు ఎటువంటి అవకాశాలు రానప్పుడు, రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగానే నన్ను జట్టులోకి తీసుకున్నాడు. నా రూమ్‌కు వచ్చి 'నువ్వు మ్యాచ్‌లు ఆడబోతున్నావ్' అని నాతో అన్నాడు. నేను ఆ మాట వినగానే ఆశ్చర్యపోయా. ఎందుకంటే అప్పటికే మా జట్టులో హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా లాంటి స్పిన్నర్లు ఉన్నారు. మేమెప్పుడు ముగ్గురు స్పిన్నర్లతో ఆడలేదు.'అని చాహల్ చెప్పుకొచ్చాడు.

ఆ ఇద్దరితో ప్రత్యేక అనుబంధం..
అయితే ముంబై తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో చాహల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో టోర్నీలో మిగతా మ్యాచ్‌ల్లో కూడా అవకాశం రాలేదు. ఇక 2014లో ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగగా.. అతనికి కావాల్సిన బ్రేక్‌త్రూ లభించింది. అయితే టీమిండియాలో రోహిత్ శర్మతో పాటు కుల్దీప్ యాదవ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని చాహల్ చెప్పుకొచ్చాడు. 'టీమ్ఇండియాలో రోహిత్, కుల్దీప్యాదవ్తో విడదీయలేని బంధం ఉంది. వారిద్దరూ అన్ని పరిస్థితుల్లోనూ నాకు అండగా ఉన్నారు. మా మధ్య మంచి సంబంధాలు, అర్థం చేసుకునేతత్వం ఉంది. వాళ్లతో సరదాగా ఉంటా. అంతా కలిసే భోజనం చేస్తాం. చాలా సరదాగా ఉంటాం. కానీ వాళ్ల మీద ఉన్న గౌరవంతో నేనెప్పుడు హద్దులు దాటలేదు. ముఖ్యంగా రోహిత్ నాకు అన్నయ్య లాంటి వాడు.'అని చాహల్ చెప్పుకొచ్చాడు.

ఆర్‌సీబీకి టైటిల్ గెలిచే చాన్స్..
ఇక కరోనాతో అర్తంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్‌ను గెలిచే అవకాశాలు ఆర్‌సీబీకి ఉన్నాయని చాహల్ తెలిపాడు. ఈ సీజన్ సెకండాఫ్ ఎప్పుడు ప్రారంభమైనా.. ఆర్‌సీబీ పని సులువవుతుందన్నాడు. ఇప్పటికే తాము టాప్-4లో ఉన్నామని, సులువుగా ప్లే ఆఫ్స్ చేరవచ్చన్నాడు. 'ఇప్పటికే మేం టాప్-4లో ఉన్నాం. ఫస్టాఫ్ లీగ్‌లో మేం మంచి పొజిషన్‌లోనే ఉన్నాం. ఎందుకంటే గత సీజన్లలో సెకండాఫ్ ప్రారంభమయ్యే సమయానికి మేం ఏడు మ్యాచ్‌ల్లో 5, 6 గెలవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ఒత్తిడి మాపై లేదు. ఈజీగా పరిస్థితులకు తగ్గట్లు ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్లవచ్చు.

మ్యాక్సీ రాకతో..
గ్లేన్ మ్యాక్స్‌వెల్ చేరికతో జట్టు సమస్యలన్నీ తీరాయి. ముఖ్యంగా విరాట్ భయ్యా, డివిలియర్స్‌పై ఉన్న ఒత్తిడి తగ్గింది. వాళ్లు స్వేచ్చగా ఆడే అవకాశం లభిస్తోంది. దేవదత్ పడిక్కల్ కూడా గత సీజన్‌లో అద్భుతంగా ఆడాడు. అదే జోరును ఈ సీజన్‌లోనూ కొనసాగించాడు. ఫస్టాఫ్ పెర్ఫామెన్స్ రిపీట్ చేస్తే మా జట్టుకు తిరుగుండదు'అని చాహల్ చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఇప్పటివరకు కెరీర్లో 108 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 125 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications