చాహల్.. చెడ్డీలు వేసుకొని క్రికెట్ ఆడోచ్చు కదా.. ఎందుకయ్యా..?

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు మీడియా నుంచి వింత ప్రశ్న ఎదురైంది. చెడ్డీలు వేసుకొని క్రికెట్ ఆడవచ్చు కదా? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. చాహల్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇక వెస్టిండీస్ పర్యటనను భారత్ విజయంతో ప్రారంభించింది.
ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్ వేదికగా శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా మూడు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. బౌలింగ్‌పరంగా మహమ్మద్ సిరాజ్ (2/57), శార్దూల్ ఠాకూర్ (2/54), యుజ్వేంద్ర చాహల్ (2/58) భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు యుజ్వేంద్ర చాహల్ హాజరయ్యాడు.

వేడిని తట్టుకోవాలంటే..
''చెడ్డీలతో క్రికెట్ ఆడొచ్చా..?'' ఎందుకంటే ఆటగాళ్లు తరచూ వేడి వాతావరణంలో ఆడుతుంటారు. ప్యాంటుకు బదులుగా హాఫ్ ప్యాంటు ధరించడం మంచిది కదా? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. భారత్‌లో గత వందేళ్ల రికార్డును తుడిచేస్తూ భారీ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తు చేశాడు. అందుకే చాహల్‌కు ఇలాంటి ప్రశ్నను సంధించాడు. అయితే కాస్త షాక్‌కు గురైన చాహల్ అలా''ఆడకూడదు'' అని సమాధానం ఇచ్చాడు. ఎందుకు ఆడకూడదో కూడా వివరించాడు.

మోకాళ్లు పోతాయి...
'షార్ట్స్ వేసుకొని ఆడితే బాగుంటుందనే వాదనను అంగీకరించను. ఎందుకంటే ఆటగాళ్లకు మోకాళ్లు చాలా కీలకం. వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బంతి కోసం లేకపోతే రన్ కోసం పరిగెత్తినప్పుడు జారుతుంటాం. చాలా గట్టిగా దెబ్బలు తగులుతాయి. నాకు ఇప్పటికే రెండు మోకాళ్లు పోయాయి. ఇంకా చాలా గాయాలు ఉన్నాయి. అందుకే ఫుల్‌గా ప్యాంట్ వేసుకుంటేనే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం'అని చాహల్ బదులిచ్చాడు.

ఐపీఎల్ వల్లే ఇదంతా..
కఠిన పరిస్థితుల్లో బౌలింగ్ ఎలా చేయాలో అవగాహన వచ్చేందుకు ఐపీఎల్ చాలా ఉపయోగపడిందని చాహల్ పేర్కొన్నాడు. ''ఐపీఎల్‌లో 16వ ఓవర్ తర్వాత కూడా బౌలింగ్ చేశాను. అందుకే ఆఖరి ఓవర్లలో బౌలింగ్ వేసేందుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉంటా. కోచ్‌లు, యాజమాన్యం మద్దతు మాకు ఎప్పుడూ ఉంటుంది. బంతి పాతబడే కొద్దీ స్పిన్‌కు అనుకూలంగా మారుతుంది. బ్యాటర్‌ను బట్టి నా బౌలింగ్ లైన్‌ను మార్చుకోవడం కూడా కలిసొచ్చింది. ఇక ఆఖరి ఓవర్‌లో సిరాజ్ 15 పరుగులను డిఫెండ్ చేయడం అద్భుతం.

మాకు ఆ నమ్మకం ఉంది..
'చివరి ఓవర్లో 15 పరుగులను కాపాడతాడని సిరాజ్‌పై మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. అంతకుముందు అతను గొప్పగా యార్కర్లు వేయడమే అందుకు కారణం. మరోవైపు వెస్టిండీస్ బ్యాటింగ్ చూస్తుంటే ఒత్తిడిగానూ అనిపించింది. వైడ్‌బాల్ బౌండరీ వెళ్లకుండా శాంసన్ గొప్పగా బంతిని పట్టుకోవడంతో మా ఆత్మవిశ్వాసం పెరిగింది'' అని చాహల్ తెలిపాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే అదే వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications