
హైదరాబాద్: టాలీవుడ్ నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆయన తన వినోదాత్మక నటనను, మానవతా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ సిక్సర్ల సింగ్ ట్వీట్ చేశాడు. బాలయ్యతో దిగిన ఓ త్రోబ్యాక్ ఫొటోను కూడా పంచుకున్నాడు.
'నందమూరి బాలకృష్ణ సర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీ ఎంటర్‌టైనింగ్ పెర్ఫెమెన్స్, మానవతా సేవా కార్యక్రమాలతో ఈ ప్రపంచాన్ని ఇలానే ఇన్‌స్పైర్ చేయండి. బసవతారకం ఆసుపత్రికి, బాలయ్య బాబుకు నా బెస్ట్ విషెస్'అని యూవీ పేర్కొన్నాడు.
సీనియర్ అండ్ టాప్ హీరో అయిన బాలయ్య బాబు నేటి(గురువారం)తో 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. బర్త్‌డే సందర్భంగా బాలయ్య కథానాయకుడిగా తెరకెక్కనున్న 107వ సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదలయింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా మైత్రీ మూవీ వేకర్స్ పతాకంపై నిర్మితమవుతోంది.
తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం బాలయ్య అఖండ చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ రూపుదిద్దుకుంటోంది. ద్వారకా క్రియేషన్స్ ఈ మూవీని తెరకెక్కిస్తుంది. ఇందులో బాలయ్యకు జంటగా ప్రగ్యా జైస్వాల్ సందడి చేయనున్నారు.