టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను అతని మెంటార్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఎగతాళి చేశాడు. తన ఆల్‌టైమ్ టీ20 రికార్డ్‌ను అభిషేక్ శర్మ అందుకోలేడని రెచ్చగొట్టాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా అర్థ శతకం బాదిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు ఫిదా అయిన యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా అతన్ని కొనియాడుతూనే.. రెచ్చగొట్టాడు.

'అభిషేక్ శర్మ.. ఇప్పటికీ 12 బంతుల్లో 50 పరుగులు చేయడం నీ వల్ల కావడం లేదు కదా? కానీ బాగా ఆడావు - ఇలాగే కొనసాగించు.'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన శిష్యుడిని యువరాజ్ సింగ్ ఉసిగొల్పుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆయనకు ఏం పోయింది.. చచ్చేది ప్రత్యర్థి బౌలర్లు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన రికార్డ్ యువరాజ్ సింగ్ పేరిట. అతను 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2027లో ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లోనే అతను 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజా మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను హార్దిక్ పాండ్యా రికార్డ్‌ను అధిగమించాడు. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.
యువరాజ్ సింగ్ - 12 బంతులు (ప్రత్యర్థి - ఇంగ్లండ్, 2007)
అభిషేక్ శర్మ - 14 బంతులు (ప్రత్యర్థి - న్యూజిలాండ్, 2026)
హార్దిక్ పాండ్యా - 16 బంతులు (ప్రత్యర్థి - దక్షిణాఫ్రికా, 2025)
దీపేంద్ర సింగ్ ఐరీ (నేపాల్) - 9 బంతుల్లో (ప్రత్యర్థి: మంగోలియా, 2023)
యువరాజ్ సింగ్ (భారత్) - 12 బంతుల్లో (ప్రత్యర్థి: ఇంగ్లాండ్, 2007)
మీర్జా అహ్సాన్ (ఆస్ట్రియా) - 13 బంతుల్లో (ప్రత్యర్థి: లక్సెంబర్గ్, 2019)
మహమ్మద్ ఫహద్ (టర్కీ) - 13 బంతుల్లో (ప్రత్యర్థి: బల్గేరియా, 2025)
తడివానాషే మారుమని (జింబాబ్వే) - 13 బంతుల్లో (ప్రత్యర్థి: గాంబియా, 2024)
జాన్ ఫ్రైలింక్ (నమీబియా) - 13 బంతుల్లో (ప్రత్యర్థి: జింబాబ్వే, 2025)
కోలిన్ మన్రో (న్యూజిలాండ్) - 14 బంతుల్లో (ప్రత్యర్థి: శ్రీలంక, 2016)
రమేష్ సతీశన్ (రొమేనియా) - 14 బంతుల్లో (ప్రత్యర్థి: సెర్బియా, 2021)
సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా) - 14 బంతుల్లో (ప్రత్యర్థి: సైప్రస్, 2024)
అభిషేక్ శర్మ (భారత్) - 14 బంతుల్లో (ప్రత్యర్థి: న్యూజిలాండ్, గౌహతి)