న్యూఢిల్లీ: బలహీనమైన జట్టుతో భారత్ ప్రపంచకప్ ఎలా గెలుస్తుందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశ్నించాడు. ఓ దేశ పౌరుడిగా భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని చెప్పి దేశ భక్తిని చాటుకున్నంత మాత్రనా అది వాస్తవం కాదని తెలిపాడు. జట్టు నిండా సమస్యలున్నాయని, మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉందని చెప్పాడు.
ఆ బలహీనతలను అధిగమించే ప్రయత్నం కూడా జరగడం లేదని యువరాజ్ సింగ్ అసహనం వ్యక్తం చేశాడు. 2011 ప్రపంచకప్ విజయంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై మరోసారి ప్రపంచకప్ జరుగుతుండటంతో టీమిండియా మళ్లీ టైటిల్ అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఈసారి టైటిల్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ప్రపంచకప్ గెలిచే సీన్ భారత్‌కు లేదని యువరాజ్ సింగ్ తెలిపాడు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా బలహీనతలను తెలియజేశాడు. 'భారత పౌరుడిగా టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుందని చెప్పి దేశభక్తిని చాటుకోవచ్చు.
కానీ ప్రపంచకప్ గెలిచేందుకు కావాల్సిన అర్హతలు భారత జట్టుకు లేవు. జట్టులో ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ గాయపడటంతో మిడిలార్డర్ బలహీనంగా ఉంది. వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు కనిపించడం లేదు. ఈ సమస్యను అధిగమించకపోతే టీమిండియాకు కష్టాలు తప్పవు.
కీలక మ్యాచ్‌ల్లో ప్రయోగాలు చేయవద్దని టీమ్‌మేనేజ్‌మెంట్‌ను కోరుతున్నా. ఓపెనర్‌గా ఆడటం వేరు.. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం వేరు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లకు చాలా స్కిల్స్ ఉండాలి. ముఖ్యంగా ఒత్తిడిని అధిగమిస్తూ బ్యాటింగ్ చేయాలి. సరిగ్గా శ్రద్ద పెడితే ఈ సమస్య తీరేది. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ ఆ సమస్యపై ఫోకస్ పెట్టడం లేదు.
మిడిల్ ఆర్డర్‌లో ఎవరిని ఆడిస్తారో తెలియడం లేదు. సూర్య, సంజూ శాంసన్, తిలక్ వర్మ ఇలా ఎవరి విషయంలోనూ స్పష్టత లేదు. జట్టులో ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు ప్రపంచకప్ జట్టుకు సిద్దంగా ఉన్నామని ఎలా చెప్పగలం. ఓపెనర్లు త్వరగా ఔట్ అయితే మిడిలార్డర్‌లో భాగస్వామ్యం నిర్మించగల ప్లేయర్లు అవసరం. క్రీజులోకి రాగానే భారీ షాట్లు ఆడే ప్లేయర్లు ఒత్తిడిని తట్టుకోలేరు.
ఒత్తిడిని అధిగమిస్తూ భాగస్వామ్యాలను నిర్మిస్తూ ఓపిగ్గా క్రీజులో కురుదుకుపోయి ఆడేందుకు ఎంతో టాలెంట్ ఉండాలి. అది చాలా కష్టమైన పని. అనుభవం ఉన్న ప్లేయర్లు మాత్రమే మిడిల్ ఆర్డర్‌లో ఆడగలరు. సరైన ప్లేయర్లతో పాటు మేనేజ్‌మెంట్ లేనప్పుడు ప్రపంచకప్ గెలుస్తామని ఎలా చెప్పగలం?'అని యువరాజ్ సింగ్ అన్నాడు.