న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, వరల్డ్ కప్ విజేత యువ రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలుస్తుందనే నమ్మకం తనకు లేదన్నాడు. భారత జట్టు మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉందని, కీలక ఆటగాళ్లంతా గాయాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు.
తాజాగా 'క్రికెట్ బసు'అనే యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'నిజాయితీగా చెప్పాలంటే ఈ సారి టీమిండియా.. వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. ఓ దేశ భక్తుడిగా భారత్ గెలుస్తుందని చెప్పవచ్చు. కానీ జట్టు పరిస్థితి పరిగణలోకి తీసుకుంటే మాత్రం చాలా సమస్యలున్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉంది.

అంతేకాకుండా రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. గాయాల కారణంగా మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు కనిపించడం లేదు. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కూడా గెలవకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే నిజాలు ఒప్పుకోక తప్పదు.
కెప్టెన్ రోహిత్ శర్మలో అపార నైపుణ్యం ఉంది. అతను కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోయినా వరల్డ్ కప్‌లో అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే 2019 వన్డే ప్రపంచకప్ ముందు కూడా రోహిత్ ఇదే పేలవ ఫామ్‌ను కనబర్చాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. కానీ వన్డే వరల్డ్ కప్ 2019లో 5 సెంచరీలతో చెలరేగాడు.
టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వడమే టీమిండియా ముందున్న అతిపెద్ద సవాల్. కనీసం 20 మంది ప్లేయర్లను వరల్డ్ కప్‌కు సిద్ధం చేయాలి. టాపార్డర్‌లో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండటంతో పటిష్టంగా ఉంది. అయితే మిడిల్ ఆర్డర్‌లో 4, 5 స్థానాలు చాలా కీలకం. రిషభ్ పంత్ కోలుకుంటే ఈ స్థానాల్లో ఆడేవాడు. ఇప్పుడు నాలుగో స్థానంలో సరైన బ్యాటర్‌ను కనిపెట్టడం టీమిండియా ముందున్న పెద్ద టాస్క్.
రింకూ సింగ్ చాలా బాగా ఆడుతున్నాడు. అతను లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో భాగస్వామ్యం నమోదు చేయగలడు. వరల్డ్ కప్ గెలవాలంటే రింకూ సింగ్‌కి అవకాశం ఇచ్చి, తగినన్ని మ్యాచులు ఆడించాలి. 'అని యువరాజ్ సింగ్ సూచించాడు.