టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల యువరాజ్ సింగ్ ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన సంగతి తెలిసిందే. క్యాన్సర్‌తో బాధపడుతూనే.. 2011 వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శనతో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మైదానంలోనే అతను రక్తపు వాంతులు చేసుకోవడం ఇప్పటికీ అభిమానుల ముందు కదలాడుతూనే ఉంటుంది.
తాజాగా తాను క్యాన్సర్‌తో పోరాడిన రోజులను యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో కలిసి ఆ గడ్డు రోజులను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో డాక్టర్లు తాను ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే 3-6 నెలలు మాత్రమే బతుకుతానని చెప్పారని వాపోయాడు. కీమో థెరపీ చేయించుకోకపోతే.. గుండె పోటు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించారని గుర్తు చేసుకున్నాడు.

'మూడు నుంచి 6 నెలలే బతుకుతానని డాక్టర్లు చెప్పారు. క్యాన్సర్ ట్యూమర్ నా ఊపిరితిత్తి, గుండె మధ్యలో ఉందని తెలిపారు. అది నరంపై ఒత్తిడి తెస్తోందన్నారు. ఒకవేళ నేను కీమో థెరపీకి వెళ్లకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు.
క్యాన్సర్ బారిన పడటంతో నాకు ఎంతో ఇష్టమైన టెస్ట్ కెరీర్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దాదాపు ఏడేళ్లు టెస్ట్ టీమ్‌లో చోటు కోసం వేచి చూశాను. సుమారు 40 టెస్ట్‌లకు 12వ ఆటగాడి ఉన్న తర్వాత నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్నా. కానీ నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి రావడంతో టెస్ట్ కెరీర్‌ను వదులుకోవాల్సి వచ్చింది.
కీమోథెరపీ సమయంలో డాక్టర్లు నాలో ధైర్యం నింపారు. నేను క్యాన్సర్‌ను జయించి ఆరోగ్యంగా నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లిపోతానని డాక్టర్ ఐన్ హార్ట్ చెప్పారు. ఆ మాటలు నాకు బలాన్నిచ్చాయి. నేను క్యాన్సర్ నుంచి కోలుకున్నాక.. ఇకపై క్రికెట్ ఆడొచ్చని వారు చెప్పాక.. అది నాకు పునర్జన్మలా అనిపించింది.'అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్ సింగ్ భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 2013లో ఆసీస్‌పై ఓ టీ20 మ్యాచ్‌లో 35 బంతుల్లోనే 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2017లో వన్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్ 150 పరుగులను ఇంగ్లండ్‌పై సాధించాడు. అదే ఏడాది వెస్టిండీస్ పర్యటనలో చివరిసారిగా మైదానంలో కనిపించాడు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.