
ఆంటిగ్వా: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఆంటిగ్వాలో జరిగిన తొలి టీ20లో పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. లంక లెగ్ స్పిన్నర్ అఖిల ధనుంజయ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో విండీస్ కెప్టెన్ ఆరు సిక్సర్లు బాదాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా చరిత్రకెక్కాడు. ఇక అంతర్జాతీయ టీ20లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదింది పోలార్డ్ మాత్రమే.
అయితే పొలార్డ్ విధ్వంసంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ఈ విండీస్ వీరుడిని సిక్స్ సిక్సెస్ క్లబ్‌లోకి సాదర స్వాగతల పలికాడు. 'సిక్స్ సిక్సెస్ క్లబ్‌లోకి పోలార్డ్‌కు స్వాగం. నీ సిక్సలు అద్భుతం'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదింది ముగ్గురు మాత్రమే. 2007 వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. గిబ్స్ విధ్వంసానికి డాన్ వాన్ బంగే బలయ్యాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. అనంతరం ఇప్పుడు కీరన్ పోలార్డ్ ఆరు సిక్సర్లు బాదాడు. టీ20లో ఆరు సిక్సులు బాదిన రెండో బ్యాట్స్‌మన్‌గా, తొలి వెస్టిండీస్ క్రికెటర్‌గా కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు.