Yuvraj Singh: క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అసాధారణ పోరాటపటిమకు నిలువెత్తు నిదర్శనం. వైట్‌బాల్ క్రికెట్‌లో భారత్‌కు దక్కిన ఆణిముత్యం. అసాధారణ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు విజయాన్ని అందించిన సందర్భాలు అనేకం. రక్తం కక్కుతూ పట్టు వీడని విక్రమార్కుడిలా దేశం కోసం ఆడిన యువీ.. భారత్ సాధించిన రెండు ప్రపంచకప్‌ల్లో కీలక పాత్ర పోషించాడు.
2007 టీ20 ప్రపంచకప్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన యువీ.. 2011 వన్డే ప్రపంచకప్‌లో బ్యాట్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్‌గా, ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన యువరాజ్ సింగ్ ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించాడు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు అసాధరణమైన ఆట తీరుతో భారత క్రికెట్‌లో తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. సిక్సర్ల సింగ్‌గా.. అభిమానుల యువ రాజుగా గుర్తింపు పొందిన యువీ నేడు 42వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌లను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
యువరాజ్ సింగ్ అనగానే క్రికెట్ అభిమానులందరికీ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలు గుర్తుకు వస్తాయి. అంతలా తన ఆటతో యువీ ఆకట్టుకున్నాడు. ఓవైపు క్యాన్సర్‌తో పోరాడుతూనే మరోవైపు ఆల్‌రౌండర్‌గా భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అనంతరం క్యాన్సర్‌ను జయించిన అతను రీఎంట్రీలోనూ సత్తా చాటాడు.
అయితే 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మాత్రం యువరాజ్ సింగ్ కెరీర్‌లో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్లో యువరాజ్ సింగ్ జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యువరాజ్ సింగ్(21 బంతుల్లో 11) జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియాకు తీరని నష్టం చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ(29), అజింక్యా రహానే(3) విఫలమైనా... విరాట్ కోహ్లీ(58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
కానీ అతనికి అండగా రాణించాల్సిన యువరాజ్ సింగ్ పూర్తిగా తడబడ్డాడు. 21 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా బాదకుండా 11 పరుగులే చేశాడు. 8 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న యువీ.. డాట్ బాల్స్ ఆడుతూ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 17.5 ఓవర్లలోనే ఛేధించి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
ఈ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్ ఇంటిపై అభిమానులు రాళ్లతో దాడి చేశారు. తన జీవితంలోనే ఇది అత్యంత చెత్త రోజని యువరాజ్ సింగ్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఆ క్షణమే తన కెరీర్ ముగిసిందనుకున్నానని తెలిపాడు. కానీ ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని మళ్లీ రీఎంట్రీ ఇచ్చానని తెలిపాడు.