Yuvraj Singh: సచిన్ టెండూల్కర్-గ్రేగ్ చాపెల్ మధ్య నెలకొన్న గొడవ కారణంగానే తనకు టీమిండియా కెప్టెన్సీ దక్కలేదని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఆ గొడవ విషయంలో సచిన్ టెండూల్కర్‌కు మద్దతుగా నిలవడం బీసీసీఐ పెద్దలకు నచ్చలేదని చెప్పాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం సీనియర్ ఆటగాళ్లంతా అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
దాంతో టీమిండియా కుర్రాళ్లతో 2007 టీ20 ప్రపంచకప్ ఆడాల్సి వచ్చింది. సీనియర్ ప్లేయర్ అయిన యువరాజ్ సింగ్‌కే జట్టు సారథ్య బాధ్యతలు దక్కుతాయని అంతా అనుకున్నారు. కానీ వైస్ కెప్టెన్ అయిన యువరాజ్ సింగ్‌కు కాకుండా మహేంద్ర సింగ్ ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆ టోర్నీలో టీమిండియా విజేతగా నిలవడంతో.. ధోనీకి మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతలు దక్కాయి.

తాజాగా సంజయ్ మంజ్రేకర్ నిర్వహించిన ఓ షోలో పాల్గొన్న యువరాజ్ సింగ్‌ను ఇదే విషయంపై ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. 'టీమిండియాకు సారథ్యం వహించాలనే ఆకాంక్ష నాకు చాలా బలంగా ఉండేది. నాకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాల్సింది. కానీ గ్రేగ్ చాపెల్-సచిన్ టెండూల్కర్ మధ్య నెలకొన్న గొడవ కారణంగా ఆ అవకాశం చేజారింది.
ఆ సమయంలో నేనొక్కడినే నా టీమ్‌మెట్ అయిన సచిన్‌కు మద్దతు తెలిపాను. అది బీసీసీఐలోని కొంతమంది పెద్దలకు నచ్చలేదు. దాంతో నన్ను తప్ప ఎవరినైనా కెప్టెన్ చేయాలని అన్నారు. ఈ విషయాన్ని బోర్డులోని నా సన్నిహితులు చెప్పారు. అయితే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.
ఆకస్మాత్తుగా నన్ను టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. ఏ మాత్రం ప్రణాళికల్లోని మహేంద్ర సింగ్ ధోనీని 2007 టీ20 ప్రపంచకప్ జట్టుకు కెప్టెన్ చేశారు. నాకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అది. కానీ ఈ విషయంలో నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. ఇప్పటికీ అదే గొడవ జరిగితే నేను నా సహచర ఆటగాడికే మద్దతుగా ఉంటాను.'అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.