ముంబై: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి తండ్రయ్యాడు. అతని భార్య హాజెల్ కీచ్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్ సింగ్ శనివారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన బిడ్డకు ఆరా అనే పేరు పెట్టినట్టు తెలిపాడు. ఆమె రాకతో తమ కుటుంబం పరిపూర్ణమైందన్నాడు.
గతేడాది జనవరిలో ఈ జంటకు బాబు పుట్టాడు. హాజెల్ కీచ్ బాబును చూసుకుంటుండగా.. చిన్నారి పాపాని ఎత్తుకున్న యువరాజ్ సింగ్ ఆ ఫొటోను తన ట్వీట్‌కు జత చేశాడు.

'నిద్రలేని రాత్రులు ఆనంద క్షణాలుగా మారాయి. మా యువరాణి ఆరాకు స్వాగతం. ఆమె రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది'అని యువీ ఆ ఫొటోకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు తన విధ్వంసకర ఆటతో ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చిన అతను.. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నానని వెల్లడించాడు.
2016లో యువరాజ్-హాజెల్‌కీచ్‌కు వివాహం కాగా.. గతేడాది ఒరియాన్ పుట్టాడు. 2019లో యువరాజ్ సింగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఆల్‌రౌండర్‌గా యూవీ భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. 2011 వన్డే ప్రపంచ కప్, 2007 టీ20 ప్రపంచకప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. టీమిండియా రెండోసారి ప్రపంచకప్ అందుకోవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. అయితే.. క్యాన్సర్ మహమ్మారి బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడ్డ యువరాజ్ సింగ్ కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చాడు.
తానొక పోరాట యోధుడని ప్రపంచానికి చాటి చెప్పాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు బాది వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. యువరాజ్ సింగ్ అనగానే అందరికీ ఈ ఇన్నింగ్సే గుర్తుకు వస్తోంది. మోడల్‌గా, బాలీవుడ్ కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హజల్ కీచ్‌ను యూవీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.