హరారే: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టీ10 లీగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించాడు. నాలుగు పదుల వయసులోనూ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి తనలో బ్యాటింగ్ చేసే సత్తా ఇంకా ఉందని చాటిచెప్పాడు.
యూఏఈ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న టీ10 లీగ్‌లో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న యూసఫ్ పఠాన్(26 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 80 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టును ఒంటి చేత్తో ఫైనల్ చేర్చాడు. డర్బన్ ఖలాండర్స్ జట్టుతో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో జోబర్గ్ బఫ్పాలోస్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ ఖలాండర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్(39), ఆసిఫ్ అలీ(32 నాటౌట్) టాప్‌స్కోరర్లుగా నిలిచారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన జోబర్గ్ టీమ్.. యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌తో 9.5 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసి గెలుపొందింది.
ఓదశలో 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జోబర్గ్ టీమ్‌ను యూసఫ్ పఠాన్ ఆదుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్(14 నాటౌట్) సాయంతో జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. జోబర్గ్ విజయానికి చివరి 18 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి పరిస్థితుల్లో.. యూసఫ్ పఠాన్ 14 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు.
వరుసగా 6,6,0,6,WD,2,4,6,1,6,4,6,4,6,4 బౌండరీలు బాది పరుగులు రాబట్టాడు. పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ బౌలింగ్‌కు యూసఫ్ పఠాన్ చీల్చి చెండాడాడు. అమీర్ వేసిన 6 బంతులను 6,6,0,6,2,4 బాది 24 పరుగులు పిండుకున్నాడు. యూసఫ్ పఠాన్ విధ్వంసానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన ఇన్నింగ్స్‌లో యూసఫ్ పఠాన్ 9 సిక్స్‌లు బాదడం విశేషం.