Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

30 పరుగులు తక్కువ చేసినా.. వారి వల్లే గెలిచాం: ఇషాన్ కిషన్

తమ లక్ష్యానికి 30-40 పరుగులు తక్కువ చేసినా.. యువ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇషాన్ కిషన్ యువ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. మా యంగ్ బౌలర్లు అదరగొట్టారు. యువ బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తుంటే కెప్టెన్‌‌కు కలిగే అనుభూతే వేరు. మా యువ బౌలర్లు స్వయంగా తమ సొంత ప్లాన్స్‌తో వస్తున్నారు. ప్రణాళిక ప్రకారమే బౌలింగ్ చేస్తున్నారు. దీని వల్ల ఫీల్డింగ్ సెట్ చేయడంలో కెప్టెన్‌‌గా నాపై ఒత్తిడి చాలా తగ్గుతుంది. ఎందుకంటే వారు ఆటలో ఇప్పటికే ప్రత్యర్థి కంటే ముందుంటున్నారు. ఈరోజు వారు బౌలింగ్ చేసిన తీరు అద్భుతం.

30 పరుగులు తక్కువ చేసినా..

మేం 30-40 పరుగులు తక్కువ చేశాం. అభిషేక్ త్వరగానే అవుట్ అయ్యాడు. అయినప్పటికీ మేం 60కి పైగా పరుగులు చేశాం. సాధారణంగా మేం 220 లేదా 230 పరుగులు చేసినప్పుడల్లా టాప్-3 బ్యాటర్లలో ఎవరో ఒకరు భారీ స్కోరు సాధిస్తారు. ఈరోజు ఆ భారీ ఇన్నింగ్స్ మిస్ అయ్యాము. మాకున్న ఈ బ్యాటింగ్ లైనప్‌ను బట్టి మేం కచ్చితంగా ఒక 20-30 పరుగులు తక్కువ చేశాం.

Young Guns Fire for SRH Captain Ishan Kishan Credits Bowlers Clarity for Thrilling Win Over CSK in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

మా యువ బౌలర్లు ప్రాక్టీస్ సెషన్లలో ఎంతలా కష్టపడుతున్నారో నాకు తెలుసు. కాబట్టి కెప్టెన్‌గా వారిని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న ఈ బౌలర్లు రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. అలాంటప్పుడు మనం చేయాల్సిందల్లా వారికి బంతిని ఇచ్చి, వారు అనుకున్నది చేయనివ్వడమే.

మంచి బ్యాటింగ్ వికెట్..

నిజం చెప్పాలంటే ఇది బ్యాటింగ్‌కు చాలా మంచి వికెట్. అందుకే మేం 30-40 పరుగులు తక్కువ చేశామని అంటున్నాను. అయితే ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. షాట్ సెలక్షన్ విషయంలో మేం ఇంకా మెరుగవ్వాలి. పాయింట్స్ టేబుల్‌ను మేం పట్టించుకోవడం లేదు. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీ అని మాకు తెలుసు. ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకుంటూ పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.'అని ఇషాన్ కిషన్ తెలిపాడు.

నిప్పులు చెరిగిన మలింగా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59), హెన్రీచ్ క్లాసెన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/22), జెమీ ఓవర్టన్(3/37) మూడేసి వికెట్లు తీయగా..ముఖేష్ చౌదరి(2/21) రెండు వికెట్లు పడగొట్టాడు. గుర్జప్నీత్ సింగ్(1/34) ఒక వికెట్ దక్కింది.

అనంతరం సీఎస్‌కే 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆయుష్ మాత్రే(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30), మాథ్యూ షార్ట్(30 బంతుల్లో 3 ఫోర్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శివమ్ దూబే(16 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(3/29) మూడు వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. శివాంగ్ కుమార్(1/18), సాకిబ్ హుస్సేన్(1/32), ప్రఫుల్ హింగే(1/60) చెరో వికెట్ తీసారు.

Story first published: Sunday, April 19, 2026, 0:49 [IST]
Other articles published on Apr 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+