భారత పర్యటనను ఆస్ట్రేలియా-ఏ జట్టు ఘనంగా ప్రారంభించింది. భారత్-ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్ట్‌ల్లో భాగంగా మంగళవారం లక్నో వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(144 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 109) భారత గడ్డపై తన తొలి మ్యాచ్‌లోనే శతకం చెలరేగాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్-ఏ జట్టు 73 ఓవర్లలో 5 వికెట్లకు 337 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్‌కు అండగా మరో ఓపెనర్ కాంప్‌బెల్ కెల్లవే(97 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 88), కూపర్ కన్నోల్లీ(84 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు.
లియామ్ స్కాట్(79 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 బ్యాటింగ్), జోష్ ఫిల్లిప్(3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్-ఏ బౌలర్లలో హర్ష్ దూబే(3/88) మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్ చెరో వికెట్ పడగొట్టారు. 11 ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిద్ కృష్ణ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. భారత్-ఏ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అతనితో పాటు అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ఖలీల్ అహ్మద్ ఈ జట్టులో ఉన్నారు. రెండో అనధికారిక టెస్ట్‌కు కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ అందుబాటులోకి వస్తారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లకు వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే రెండు టెస్ట్ సిరీస్‌లో అవకాశం దక్కనుంది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా-ఏ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఆసీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. సామ్ కొన్‌స్టాస్ తనదైన శైలిలో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కాంప్‌బెల్‌తో కలిసి తొలి వికెట్‌కు 198 పరుగులు జోడించాడు. అతన్ని హర్ష్‌దూబే క్లీన్ బౌల్డ్ చేయగా.. సెంచరీ దిశగా సాగిన కాంప్‌బెల్ గుర్నూర్ బ్రార్ క్యాచ్ ఔట్ చేశాడు. కెప్టెన్ నాథన్ మెక్‌స్వామి(1), ఒలివర్ పీక్(2) త్వరగానే ఔటైనా.. కూపర్ కన్నోల్లీ, లియామ్ స్కాట్ నాలుగో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగిన కూపర్ కన్నోల్లిని హర్ష్‌దూబే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన జోష్ ఫిలిప్పేతో కలిసి లియామ్ స్కాట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. తొలి రోజు 73 ఓవర్ల ఆటే సాధ్యమైంది.
గతేడాది డిసెంబర్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సామ్ కొన్‌స్టాస్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఏమాత్రం బెరుకు లేకుండా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా వరల్డ్ క్లాస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను చితక్కొట్టాడు. అతని ధాటికి బుమ్రా 4 ఏళ్ల తర్వాత టెస్ట్‌ల్లో సిక్సర్ సమర్పించుకున్నాడు. దాదాపు 4,483 బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో సామ్ కొన్‌స్టాస్ 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.