టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మకు మరో ఐదేళ్ల పాటు ఆడే సత్తా ఉందని చెప్పాడు. అతను ఫిట్‌నెస్ మెరుగుపర్చుకుంటే 45 ఏళ్ల వరకు ఆడగలడని తెలిపాడు. అతని ఫిట్‌నెస్‌పై విమర్శలు చేయడం ఆపేయాలని విమర్శకులకు సూచించాడు.
మరో ఐదేళ్ల పాటు రోహిత్ జట్టులో కొనసాగేలా బీసీసీఐ చర్యలు తీసుకోవాలన్నాడు. నలుగురు సహాయకులను పెట్టి రోహిత్ శర్మను ప్రతీ రోజు ఉదయం 10 కిలోమీటర్లు పరుగెత్తించాలని చెప్పాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్సే అతని సామర్థ్యాన్ని తెలియజేస్తుందని యోగ్‌రాజ్ సింగ్ స్పష్టం చేశాడు.

టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్ శర్మ.. వన్డే ప్రపంచకప్ 2027 వరకు కొనసాగడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీలతో బీసీసీఐ చర్చించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ఈ ఇద్దరూ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతారనే చర్చ కూడా జరిగింది. కుర్రాళ్లు రాణిస్తున్నప్పుడు రోహిత్, కోహ్లీల అవసరం భారత జట్టుకు లేదని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ గురించి మాట్లాడిన యోగ్‌రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'రోహిత్ శర్మ గురించి చాలా మంది అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. అతను మరో ఐదేళ్ల పాటు ఆడగలడు. అతను బ్యాటింగ్ చేసే తీరు ఎలా ఉంటుందంటే.. రోహిత్ ఆట ఒకవైపు అయితే.. మిగిలిన జట్టు అంతా మరోవైపు. అతన్ని ఇన్నింగ్స్ ఓవైపు.. మిగిలిన ప్రపంచం మరోవైపు అన్నట్లు అతని ఆట ఉంటుంది. ఈ దేశానికి రోహిత్ అవసరం మరో ఐదేళ్లు ఉంది. అతనికి నలుగురు కోచ్‌లను పెట్టి ప్రతీ ఉదయం 10 కిలోమీటర్లు పరుగెత్తించండి. అతను కావాలనుకుంటే 45 ఏళ్ల వరకు ఆడగలిగే సామర్థ్యం ఉంది.
ఏ ఆటగాడైనా ఫిట్‌గా.. ఫామ్‌లో ఉండాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలి. ఎంత ఎక్కువ ఆడితే అంత ఫిట్‌గా తయారవుతారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్సే అతని సామర్థ్యం ఏంటో తెలియజేస్తోంది. ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. అలాంటి ఆటగాడి గురించి మాట్లాడే స్థాయి మీకు(విమర్శకులు) ఉందా? అతనిపై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి?'అని యోగ్ రాజ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.