టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు దేశవాళీ క్రికెట్ ఆడాలని మాజీ క్రికెటర్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ సూచించాడు. ఆట కంటే ఎవరూ గొప్ప కాదని.. క్రికెట్ దిగ్గజాలైన సర్ వివియన్ రిచర్డ్స్, సర్ డాన్ బ్రాడ్‌మన్‌లు కూడా క్రికెట్ తర్వాతేనని అభిప్రాయపడ్డాడు.
అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఇటీవల బీసీసీఐ రూల్ పెట్టిన విషయం తెలిసిందే. వరుస పరాజయాల నేపథ్యంలో జట్టును గాడిన పెట్టేందుకు బీసీసీఐ.. కొత్తగా 10 కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఈ 10 రూల్స్‌పై అధికారిక ప్రకటన రాకపోయినా.. మీడియాకు లీకయ్యాయి. ఈ రూల్స్‌పై స్పందించిన యోగ్ రాజ్ సింగ్.. ఎవరైనా సరే అందుబాటులో ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలన్నాడు.

'ఆట కంటే ఎవరూ తోపు కాదు. వివ్ రిచర్డ్స్, డాన్ బ్రాడ్‌మన్‌లు కూడా క్రికెట్ కంటే గొప్ప వాళ్లు కాదు. వాళ్లే కాదు ఎవరూ కూడా ఆట కంటే గొప్పవాళ్లు కాలేరు. కాబట్టి విదేశీ పర్యటనల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. సీనియర్ టెస్ట్ ప్లేయర్స్ దేశవాళీ క్రికెట్ ఆడితే.. మిగతా కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతోంది.
భారత జట్టుకు దూరంగా ఉన్నప్పుడు నా కొడుకు(యువరాజ్ సింగ్) దేశవాళీ క్రికెట్ ఆడేవాడు. అతను తరుచూ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగేవాడు. భారత జట్టుకు సిరీస్, టోర్నీ లేకుంటే ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫిట్‌నెస్ క్యాంప్‌లతో ఒరిగేది ఏం లేదు. నెట్స్‌లో ఏం ఉండదు. కథంతా మ్యాచ్‌లోనే ఉంటుంది.'అని యోగ్‌రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్న భారత ఆటగాళ్లందరికి దేశవాళీ క్రికెట్ ఆడే సమయం ఉంది. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, మహమ్మద్ సిరాజ్ రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్దమవుతున్నారు. విరాట్ కోహ్లీ ఆడటంపై మాత్రం సందిగ్దత నెలకొంది. అతను ప్రస్తుతం మెడనొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.