టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. క్రికెటర్ల రిటైర్మెంట్‌కు భార్య, పిల్లలే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. కుటుంబం, పిల్లలను చూసుకోవాలని, ఆట నుంచి తప్పుకోవాలని ఆటగాళ్లపై వారి సతీమణులు ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా భార్య, పిల్లల కోసమే ఆటకు వీడ్కోలు పలికారని, ఇది వారికి భావ్యం కాదని పేర్కొన్నారు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్ రాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వయసుకు ఆటకు సంబంధం లేదని నొక్కి చెప్పారు.
'భారత్‌లో 40 ఏళ్లు రాగానే 'మాకు వయసైపోయింది'అని జనాలు అంటున్నారు. మహిళలు 30 ఏళ్లు దాటగానే.. ఫిట్‌నెస్ కోల్పోయి షేప్ ఔట్ అవుతున్నారు. పిల్లలు పెద్దయ్యారు ఇంకేం చేస్తాం అని అంటున్నారు. ఇలాంటి వారితో మనం ఏం చేయగలం? నేను డైరెక్టర్‌గా ఉన్న నా జిమ్‌లో ఒక కొత్త రూల్‌ను తీసుకొచ్చాను. సీనియర్ సిటిజన్స్‌ను తిరిగి ఫిట్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాను. అసలు ఆటకు, వయసుకూ సంబంధం ఏంటి?

ఇంకేం జరుగుతుందో తెలుసా? ఇంట్లోని మహిళలు.. తమ భర్తలకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెడతారు. రిటైర్ అయ్యే సమయం వచ్చిందని, కుటుంబం, పిల్లలను చూసుకోవాలని చెబుతుంటారు. ఒక అథ్లెట్ అద్భుతమైన భవిష్యత్తును మహిళలు దెబ్బతీయవద్దు. నోబెల్ మెన్, ఆటగాడికి మతం, కులం ఉండవు. వారు దేవుడికి సంబంధించిన వారు. బతికున్నంత కాలం ఎన్నో సాధించగలరు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చిన్న వయసులోనే ఆట నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. జీవితాంతం వారికి ఇది అవమానకరం. మీరే అత్యుత్తమమని, జట్టుకు ఎంతో అవసరమని ప్రపంచానికి చాటి చెప్పండి. మీకు 50 ఏళ్లు వచ్చినా సరే.. డబుల్ సెంచరీలు బాదుతుంటే మిమ్మల్ని జట్టు నుంచి తీసేయలేరు. ఈ దేశంలో వయసు అనే అంశం చాలా విచిత్రంగా ఉంటుంది.'అని యోగరాజ్ సింగ్ పేర్కొన్నారు. మహిళల పట్ల యోగ్‌రాజ్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపాయి. యోగ్‌రాజ్ సింగ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా ఈ ఇద్దరూ ఆటలో కొనసాగుతున్నారు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ మరో 10 ఏళ్ల వరకు ఐపీఎల్ ఆడాలని యోగ్ రాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. అతన్ని రిటైర్ అవ్వాలని చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదని విమర్శకులకు కౌంటరిచ్చాడు.