ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీవ్రంగా నిరాశపర్చాడు. భారీ అంచనాలతో ఈ సీజన్‌ను ప్రారంభించిన రిషభ్ పంత్.. దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్ ధర పలికిన రిషభ్ పంత్.. 12 ఇన్నింగ్స్‌ల్లో 12.27 సగటు, 100 స్ట్రైక్‌రేట్‌తో 135 పరుగులే చేశాడు. అతని వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. దాంతో లక్నో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.
రిషభ్ పంత్ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హై ప్రైజ్ ట్యాగ్ రిషభ్ పంత్ కొంపముంచిందని, అతనిపై అనవసర ఒత్తిడిని తీసుకొచ్చిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్సీతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం వల్ల కూడా రిషభ్ పంత్ ఒత్తిడికి గురయ్యాడని, స్వేచ్ఛగా తనదైన శైలిలో బ్యాటింగ్ చేయలేకపోయాడని కూడా క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

తాజాగా రిషభ్ పంత్ వైఫల్యంపై స్పందించిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ టెక్నిక్‌లోని లోపం కారణంగానే రిషభ్ పంత్ విఫలమయ్యాడని చెప్పాడు. ఐదు నిమిషాల్లో అతని సమస్యను సరిదిద్దవచ్చని చెప్పాడు.
'రిషభ్ పంత్ బ్యాటింగ్ వైఫల్యానికి ప్రధాన కారణం సాంకేతిక లోపం. ఐదు నిమిషాల్లో పంత్ సమస్యను సరిచేయవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ చేసే సమయంలో రిషభ్ పంత్ హెడ్ పొజిషన్ సరిగ్గా లేదు. ఎడమ భుజాన్ని ఎక్కువగా ఓపెన్ చేస్తున్నాడు. ఈ లోపాలను సరిచేసుకుంటే పంత్ త్వరలోనే తన అత్యుత్తమ ఫామ్‌ను తిరిగి పొందగలడు.'అని యోగ్‌రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. యోగ్ రాజ్ సింగ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు అవునని అంటే.. మరికొందరు కాదని చెబుతున్నారు. యోగ్ రాజ్ సింగ్ ఓ కోచ్. అయితే వివాదాస్పద వ్యాఖ్యలతో అతను తరుచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. గతంలో సచిన్ టెండూల్కర్‌ను ఉద్దేశించి కూడా యోగ్ రాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌ను పక్కనపెట్టి బౌలింగ్‌పై ఫోకస్ పెట్టాలని చెప్పాడు.