టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్‌లపై యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యువరాజ్ సింగ్‌కు అనుకున్నంత పేరు రాకపోవడానికి ధోనీనే కారణమని ఆరోపించాడు.
అంతేకాకుండా కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ కంటే యువరాజ్ సింగ్ గొప్ప ఆటగాడని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.తాజాగా తన చిన్ననాటి సంగతులను యోగ్ రాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. తన కళ్ల ముందే తన తండ్రి పులిని చంపి ఆ రక్తాన్ని తనకు పూసాడని చెప్పుకొచ్చాడు.

తన క్రికెట్ అకాడమీలో జాయిన్ కావాలనుకునేవారికి ప్రాణభయం ఉండొదని చెబుతూ.. చిన్నతనంలో చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 'నా క్రికెట్ అకాడమీలో చేరాలంటే ముందు ప్రాణ భయం వీడాలి. నాకు మూడేళ్ల వయస్సున్నప్పుడు మా అమ్మతో పాటు నన్ను మా నాన్న పులి వేటకు తీసుకెళ్లారు. మా అమ్మ చాలా భయపడింది.
దానికి నాన్న స్పందిస్తూ.. 'వాడు చనిపోయినా పర్లేదు కానీ పులిలా పెంచుతా'అని అన్నాడట. ఆ మూడేళ్ల వయసులోనే మా అమ్మ పక్కన కూర్చోని అడవికి వెళ్లాను. మా నాన్న రైఫిల్‌ను పట్టుకొచ్చాడు. ఓ అర్థారాత్రి మంచంపై కూర్చొని ఉండగా.. పులి వచ్చింది. ఒక్కసారిగా నేను అరిచా. వెంటనే మా అమ్మ నోరు మూసేసింది.
కేవలం ఆరు అడుగుల దూరం నుంచే మా నాన్న పులికి రైఫిల్ ఎక్కుపెట్టారు. తలమీద గురిపెట్టి కొట్టారు. ఆ దెబ్బకు పులి నేలకొరిగింది. వెంటనే నన్ను కిందకు దించమని చెప్పాడు. పులి బిడ్డ గడి తినదన్నారు. ఆ మాటలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి. నన్ను ఆ పులి మీద కూర్చోబెట్టి.. దాని రక్తాన్ని నాపై చిమ్మారు. ఇప్పటికీ ఆ ఫొటో మా ఇంట్లో ఉంది. నా అకాడమీని కూడా అలాగే రన్ చేస్తున్నా.
యువరాజ్ సింగ్‌ను కూడా అలాగే పెంచాను. నిర్భయంగా ఉండటం నేర్పించాను'అని యోగ్‌రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యోగ్‌రాజ్ సింగ్ చెప్పిన స్టోరీ నమ్మశక్యంగా లేదని కామెంట్ చేస్తున్నారు.