ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయకపోవడాన్ని మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ తప్పుబట్టాడు. నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రానా జట్టులో నుంచి తప్పించడం సరికాదన్నాడు. శుభ్‌మన్ గిల్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీతో పాటు న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టు నుంచి శుభ్‌మన్ గిల్, జితేశ్ శర్మలను తప్పించిన సెలెక్టర్లు.. ఇషాన్ కిషన్, రింకూ సింగ్‌లకు అవకాశం కల్పించారు. అక్షర్ పటేల్‌కు తిరిగి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మిడిలార్డర్‌ను బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇచ్చిన అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

తాజాగా టీ20 ప్రపంచకప్ జట్టుపై మాట్లాడిన యోగ్ రాజ్ సింగ్.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. గతంలో కపిల్ దేవ్‌ను కూడా ఇలానే తప్పించి ఉంటే భారత జట్టుకు ఒక గొప్ప కెప్టెన్ దక్కేవాడా? అని ప్రశ్నించాడు. 'టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను ఎందుకు జట్టులో నుంచి తొలగించారు? కేవలం 4,5 ఇన్నింగ్స్‌లో విఫలమైనంత మాత్రానా పక్కనపెట్టేస్తారా? 100 అవకాశాలు ఇస్తే 10 మ్యాచ్‌ల్లో మాత్రమే రాణించే క్రికెటర్లు మన జట్టులో లేరా? వారంతా ఇంకా ఆడుతున్నారు కదా?
అభిషేక్ శర్మ ఓ రెండేళ్ల క్రితం జట్టులోకి వచ్చాడు. అతను ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే.. ఇలానే పక్కన పెట్టేస్తారా?
ఒకప్పుడు కపిల్ దేవ్‌ను కూడా ఇలానే జట్టులో నుంచి తప్పించి ఉంటే టీమిండియాకు గొప్ప కెప్టెన్ అయ్యేవాడా? కపిల్ దేవ్ తరహాలో శుభ్‌మన్ గిల్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. మీకో ఉదాహరణ చెబుతా.. బిషన్ సింగ్ బేడీ సారథ్యంలో టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆ పర్యటనలో కపిల్ దేవ్ అటు బ్యాటు.. ఇటు బంతితోనూ దారుణంగా విఫలమయ్యాడు. అయినప్పటికీ బిషన్ సింగ్ బేడీ అతన్ని ఇంగ్లండ్ పర్యటనకు తీసుకెళ్లాడు.'అని యోగ్ రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి దూరమైన గిల్.. న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టును భారత సెలెక్టర్లు నేడు ప్రకటించే అవకాశం ఉంది.