ఈ ఏడాది భారత క్రికెట్‌కు బాగా కలిసొచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయంతో మొదలైన భారత క్రికెట్ విజయాల జోరు.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ వరకు కొనసాగింది. భారత మహిళా క్రికెటర్లు కూడా ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడారు. ఈ మరుపురాని విజయాల మధ్య 'నో బాల్స్' వంటి చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ అనూహ్య ఘటనలు అభిమానులకు గుండెకోతను మిగిల్చాయి. ఈ ఏడాది టీమిండియా అభిమానులను బాధపెట్టిన ఆ ఘటనలపై ఓ లుక్కెద్దాం.
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అభిమానులు షాక్‌కు గురయ్యాడు. సరిగ్గా ఇంగ్లండ్ పర్యటనకు ముందే వారం రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరు దిగ్గజాలు సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్నా.. తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ కొనసాగుతాడని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ రోహిత్ శర్మను అనుసరిస్తూనే కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్‌కు అల్విదా ప్రకటించాడు. ఈ ఇద్దరి ఆకస్మిక నిర్ణయం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడని ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ఈ ఇద్దరి దిగ్గజాల వీడ్కోలును అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

వైట్‌బాల్ ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా.. టెస్ట్ క్రికెట్‌లో మాత్రం తడబడుతుంది. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టెస్ట్‌ల్లో భారత్‌కు కలిసి రావడం లేదు. గతేడాది న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై 3 టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన భారత్.. ఈ ఏడాది ఆ పేలవ ప్రదర్శనను పునరావృతం చేసింది.
సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో వైట్‌వాష్ అయ్యింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 30 పరుగులతో ఓడిన భారత్.. గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 408 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ పరాజయం.. భారత డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపనుంది.
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. గత ఆదివారం(డిసెంబర్ 21) పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 191 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత అండర్ 19 జట్టు.. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరింది. కానీ తుది పోరులో చేతులెత్తేసింది. ఈ ఓటమిని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. దాంతో ఈ విజయాన్ని అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. కానీ ఆర్‌సీబీ ఫ్రాంచైజీ నిర్వహించిన విజయోత్స వేడుక విషాదంగా ముగిసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందారు. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ ఘటన విషాదంగా ముగిసింది.