టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు అనేక మంది క్రీడా దిగ్గజాలు ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలికారు. సుదీర్ఘ కాలం తమ ఆటతో అభిమానులను అలరించిన దిగ్గజ ఆటగాళ్లు చివరి ఆట ఆడి అల్విదా ప్రకటించారు.
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. సరిగ్గా ఇంగ్లండ్ పర్యటనకు ముందే వారం రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరు దిగ్గజాలు సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్నా.. తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ కొనసాగుతాడని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ రోహిత్ శర్మను అనుసరిస్తూనే కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్‌కు అల్విదా ప్రకటించాడు. ఈ ఇద్దరి ఆకస్మిక నిర్ణయం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడని ప్రచారం జరిగింది.
ఏది ఏమైనా ఈ ఇద్దరి దిగ్గజాల వీడ్కోలును అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ, రోహిత్‌లు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

అమెరికా డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ జాన్‌సెనా కూడా ఈ ఏడాదే రిటైర్ అయ్యాడు. డిసెంబర్ 13, 2025న జరిగిన సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో గుంతర్ చేతిలో ఓటమి అనంతరం జాన్‌సెనా రిటైర్మెంట్ ప్రకటించాడు. సుమారు 24 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో, గుంతర్ వేసిన 'స్లీపర్ హోల్డ్'కు తట్టుకోలేక సెనా ట్యాప్ ఔట్ అయ్యారు. 2004 తర్వాత జాన్ సెనా ఒక మ్యాచ్‌లో సబ్మిషన్ ద్వారా ఓడిపోవడం ఇదే తొలిసారి.
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 డేవిస్ కప్‌లోనే అతను చివరి మ్యాచ్ ఆడినప్పటికీ.. ఈ ఏడాది అతను వీడ్కోలు గేమ్స్‌లో పాల్గొన్నాడు. కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన రాఫెల్ నాధల్.. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించాడు. ఆటకు తన శరీరం సహకరించదని అల్విదా ప్రకటించాడు. అతని నిర్ణయంతో టెన్నిస్ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.
భారత మహిళా హాకీ ప్లేయర్ వందన కటారియా కూడా ఈ ఏడాదే వీడ్కోలు పలికింది. కెరీర్‌లో 330 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్ సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించడం ఆమె కెరీర్‌కే హైలైట్. ఈ ఘనత సాధించిన తొలి భారత హాకీ ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.
వయస్సు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తూ రోహన్ బోపన్న సుదీర్ఘ కాలం తన కెరీర్ కొనసాగించాడు. ఈ ఏడాది నవంబర్ 1న ఆటకు వీడ్కోలు పలికాడు. 2024లో పురుషుల డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించి ఈ ఘనతను అందుకున్న అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. భారత్‌లో టెన్నిస్‌ను అభివృద్ధి చేయడంపై అతను ఫోకస్ పెట్టాడు.
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. అఫ్గానిస్థాన్ అతను సాధించిన డబుల్ సెంచరీ మ్యాక్స్‌వెల్ కెరీర్‌కే హైలైట్‌గా నిలిచింది. మ్యాక్సీ ఇక టీ20 ఫార్మాట్‌లో మాత్రమే ఆడనున్నాడు.
సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్ 34 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన క్లాసెన్.. ఫ్రాంచైజీ లీగ్ మాత్రమే ఆడుతానని స్పష్టం చేశాడు. కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
డెన్మార్క్ ఫుట్‌బాలర్ సైమన్ కీరన్ ఈ ఏడాది జనవరి 13న రిటైర్మెంట్ ప్రకటించాడు. యూరో కప్‌లో అతని ప్రదర్శన చరిత్రలో నిలిచిపోయింది.
రియల్ మాడ్రిడ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రెజిలియన్ లెఫ్ట్ బ్యాక్ మార్సెలో ఫిబ్రవరి 6న రిటైర్ అయ్యాడు. అతను 5 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలను గెలుచుకున్నాడు. వరల్డ్ ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ డిఫెండర్లలో ఒకడు.