ఈ ఏడాది భారత క్రీడా రంగానికి బాగా కలిసొచ్చింది. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో మొదలైన భారత విజయ ప్రస్థానం.. మహిళల వన్డే ప్రపంచకప్ విజయం వరకు కొనసాగింది. పురుషుల హాకీ టీమ్ ఆసియకప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. చదరంగంలో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ ప్రపంచకప్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా 90.23 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి సరికొత్త రికార్డ్‌తో సత్తా చాటాడు. మొత్తానికి 2025 క్రీడా రంగానికి చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
అందని ద్రాక్షగా ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్ భారత్ ఒడిలో చేరింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి సరికొత్త చరిత్రను లిఖించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 298/7 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ దీప్తి శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగింది. అనంతరం సౌతాఫ్రికా 246 పరుగులకే ఆలౌట్ కాగా.. దీప్తి శర్మ ఐదు వికెట్లుతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయం భారత మహిళల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. గత రెండు ప్రయత్నాల్లో చేజారిన కప్.. మూడో ప్రయత్నంలో చేజిక్కింది. లీగ్ దశలో నాలుగో స్థానంలో నిలిచిన భారత్.. సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది.
ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్.. 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఫైనల్లో కివీస్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ అజేయ శతకంతో ఛేదించి సునాయస విజయాన్నందుకుంది.

ఈ టోర్నీలో కోహ్లీ వేగంగా 14,000 వన్డే పరుగులు చేయగా.. మహ్మద్ షమీ 200 వన్డే వికెట్లు సాధించాడు. రోహిత్ శర్మ అత్యధిక సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ (2002, 2013 తర్వాత) గెలుచుకోవడం ద్వారా భారత్ ఆస్ట్రేలియాను అధిగమించి ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.
భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరి వ్యక్తిగత ఉత్తమ రికార్డు నమోదు చేశాడు. 90 మీటర్ల మార్కును అధిగమించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ టైటిల్స్ ఉన్నా.. అతనికి ఈ మైలురాయి దక్కలేదు. ఈ త్రో అతనికి ఆ ఈవెంట్‌ను గెలిపించడమే కాకుండా.. అతని నిలకడపై తలెత్తిన సందేహాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. జూలైలో బెంగళూరు వేదికగా నిర్వహించిన నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఇది ప్రపంచ అథ్లెటిక్స్ కేటగిరీ-ఎ ఈవెంట్ కాగా.. 14,000 మంది ప్రేక్షకులు, అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు హాజరయ్యారు.
భారత స్టార్ చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. జూలైలో జరిగిన ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. తెలుగు తేజం కోనేరు హంపితో జరిగిన ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్ 2.5-1.5 తేడాతో విజేతగా నిలిచింది. మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ఫలితాన్ని టై బ్రేకర్ ద్వారా తేల్చారు. జు జినర్, హారికా ద్రోణవల్లి, టాన్ ఝోంజి వంటి అగ్రశ్రేణి క్రీడాకారులనూ ఆమె ఓడించారు. ఈ విజయంతో ఆమె భారతదేశ నాలుగో మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి, 2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో స్థానాన్ని దక్కించుకుంది.
భారత పురుషుల హాకీ జట్టు ఆగస్టు-సెప్టెంబర్‌లో బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మెన్స్ హాకీ ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఇది భారత్‌కు నాలుగో టైటిల్ కాగా.. 2017 తర్వాత తొలి విజయం. ఆతిథ్య దేశంగా భారత్, గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన దక్షిణ కొరియాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో 2026 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.