ఈ ఏడాది(2024)కి గుడ్‌బై చెప్పే టైమ్ వచ్చింది. మరికొద్ది గంటల్లో 2025 నూతన ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2024 టీమిండియాకు మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలుచుకుంది.
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2024లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. సౌతాఫ్రికాతో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 76) సూపర్ బ్యాటింగ్.. జస్‌ప్రీత్ బుమ్రా సెన్సేషనల్ బౌలింగ్.. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షో.. సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్.. రిషభ్ పంత్ అతి తెలివి.. రోహిత్ సూపర్ కెప్టెన్సీ టీమిండియాకు విజయాన్నందించాయి.

13 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. ఈ అపూర్వ విజయంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ రోబోలా నడుచుకుంటూ వచ్చి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని అందుకున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. రోహిత్ ఐకానిక్ వాకింగ్ స్టైల్ చూసి తోటి ఆటగాళ్లతో పాటు జై షా నవ్వుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత ఈ ఐకానిక్ సెలెబ్రేషన్స్ పాపులర్ అయ్యింది.
లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఖతార్ వేదికగా జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి ఫిపా ప్రపంచ కప్ 2022ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంలో లియోనెల్ మెస్సీ ఈ ఐకానిక్ మూమెంట్‌తో ట్రోఫీని లిఫ్ట్ చేశాడు. దీంతో అప్పటి నుంచి ఇది బాగా పాపులర్ అయింది. మెస్సీ తరహాలో ట్రోఫీ అందుకోవాలని కుల్దీప్ యాదవ్.. రోహిత్ శర్మ సూచించాడు. దాంతో ఈ ఐకానిక్ ట్రోఫీ సెలెబ్రేషన్ మరింత పాపులర్ అయ్యింది. 2024లోనే ది బెస్ట్ మూమెంట్ ఇదేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
THE BEST MOMENT OF 2024. 🇮🇳❤️pic.twitter.com/9MeMAFr14Y
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2024