Year Ender 2023: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఐసీసీ టైటిల్ గెలవలేదన్న లోటు మినహా బ్యాటర్‌గా విరాట్ కోహ్లీకి తిరుగులేదు. మైదానంలో పరుగుల వరద పారించిన కోహ్లీ.. పాత బ్యాటర్‌ను తలపిస్తూ రికార్డుల మోత మోగించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ బ్యాటింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఈ ఏడాది అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేలు, టెస్ట్‌లు మాత్రమే ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 34 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 66.68 సగటుతో1934 రన్స్ చేశాడు. ఇందులో 8 సెంచరీలు.. 9 హాఫ్ సెంచరీలున్నాయి.
ఒక్క వన్డే ఫార్మాట్‌లోనే 24 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ..72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు. 6 సెంచరీలతో పాటు 8 అర్థశతకాలు బాదాడు.

శ్రీలంక, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లీ.. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అదే జోరును కొనసాగించాడు. 49.50 సగటుతో 297 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినా.. 14 ఇన్నింగ్స్‌ల్లో 639 పరుగులు చేశాడు. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 14, 49 పరుగులతో విఫలమయ్యాడు. దాంతో టీమిండియా తృటిలో ఐసీసీ టైటిల్‌ను కోల్పోయింది.
ఆసియా కప్‌లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. కోహ్లీ ఓ సెంచరీతో 129 పరుగులు చేశాడు. అనంతరం ప్రపంచకప్‌లో తన అసలు స్వరూపం చూపించాడు.
11 మ్యాచ్‌ల్లో 95.63 సగటుతో 765 పరుగులు చేశాడు. 3 సెంచరీలతో పాటు 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక స్కోర్ 117 కాగా.. ఇందులో క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో శతకాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ క్లిష్ట పరిస్థితుల్లో 63 పరుగులతో సత్తా చాటాడు.
ఓ సింగిల్ ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. వన్డేల్లో 50 సెంచరీల ఘనతను అందుకొని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకుండా వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్‌లో తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
ప్రపంచకప్ పరాజయం అనంతరం ఆటకు దూరంగా ఉన్న కోహ్లీ.. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ఐసీసీతో పాటు ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడం మినహా.. ఈ ఏడాది కోహ్లీకి అద్భుతంగా సాగింది.