ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023ను ప్రకటించాడు. ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఈ జట్టును ఎంపిక చేశాడు. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లే చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురు ప్లేయర్లు ఈ జట్టుకు ఎంపికవ్వగా.. ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు చోటుదక్కించుకున్నారు.
వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఈ ఏడాది టెస్ట్ మ్యాచ్‌లు చాలా తక్కువగా జరిగాయి. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆసీస్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ జట్టు కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ పర్యవేక్షణలో టెస్ట్ క్రికెట్‌కు ఓ కొత్త ఊపును తీసుకొచ్చింది. ఆశించిన ఫలితాలు సాధించకున్నా.. అభిమానులను తమ ధనాధన్ బజ్‌బాల్ గేమ్‌తో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే హర్షా భోగ్లే ఇంగ్లండ్ ప్లేయర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు.

జోరూట్, హ్యారీ బ్రూక్, జాకీ క్రాలీతో పాటు స్టువర్ట్ బ్రాడ్‌లను ఎంపిక చేశాడు. ఇక ఈ ఏడాది టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను హర్షా భోగ్లే ఓపెనర్‌గా తీసుకున్నాడు. ఈ ఆసీస్ ఓపెనర్ ఈ ఏడాది 13 మ్యాచ్‌ల్లో 1210 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన నాథన్ లయన్(47)కు మాత్రం చోటివ్వలేదు.
స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను ఎంపిక చేశాడు. మిడిలార్డర్ బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్, హ్యారీ బ్రూక్, టామ్ బ్లండెల్‌లను తీసుకున్నాడు. మరో ఓపెనర్‌గా జాక్ క్రాలీకి అవకాశం ఇచ్చాడు. పేసర్లుగా మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్, జోష్ హజెల్‌వుడ్‌లను తీసుకున్నాడు.
ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని, కెప్టెన్ రోహిత్ శర్మను హర్షా భోగ్లే పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఏడాది 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 55.91 సగటుతో 671 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలతో పాటు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ 8 మ్యాచ్‌ల్లో41.92 సగటుతో 545 రన్స్ చేశాడు. ఇందులో రెండు శతకాలతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.