ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా వన్డే ప్రపంచకప్ 2023 బరిలోకి దిగిన ఇంగ్లండ్.. పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ద్వైపాక్షిక సిరీస్‌లోనూ పేలవ ప్రదర్శననే కొనసాగించింది. ఈ ఏడాది ఇంగ్లండ్ టెస్ట్‌లు, టీ20ల్లో ఒక్క సిరీస్ కూడా గెలవలేదు.
బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-3తో కోల్పోయింది. ఆఖరి టీ20లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. వన్డే సిరీస్‌ను సైతం 2-1తో ఇంగ్లండ్ కోల్పోయింది.

సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌తో ఈ ఏడాదిని ప్రారంభించిన ఇంగ్లండ్ 1-2తో ఓటమిపాలైంది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలిచింది. అనంతరం బంగ్లాదేశ్ చేతిలో మూడు టీ20ల సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.
ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్ గెలిచిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసినా.. మాజీ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా సిరీస్‌ను రిటైన్ చేసుకుంది. సునాయసంగా గెలవాల్సిన సిరీస్‌ను బజ్‌బాల్ బ్యాటింగ్‌తో హెచ్చులకు పోయి ఓటమిపాలైంది.
అనంతరం న్యూజిలాండ్‌తో నాలుగు టీ20ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగు వన్డేల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ 1-0తో గెలుపొందింది. ఇందులో రెండు మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. వన్డే ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లే గెలిచి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.
ఈ ఏడాది బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన ఇంగ్లండ్.. టెస్ట్‌లు, టీ20ల్లో ఖాతా తెరవలేకపోయింది. వెస్టిండీస్ పర్యటనలోనూ ఆ జట్టుకు చుక్కెదురైంది. విజయాలు అందుకోకపోయినా బజ్‌బాల్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించింది.