Year Ender 2020: పేదరికం.. గ్రామంలో అకాడమీ.. నీళ్ల క్యాన్‌తో పిచ్‌లు సిద్ధం.. టీమిండియాలో చోటు!! నట్టూ స్టోరీ

హైదరాబాద్: తంగరసు నటరాజన్.. ఐపీఎల్ 2020 సీజన్ వరకు పెద్దగా ఎవరీకి తెలియని పేరు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్లో రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కట్టుదిట్టమైన యార్కర్లతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా భారత క్రికెట్ జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. అనూహ్యంగా వచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. వరుస పరాజయాలతో చతికిలపడ్డ భారత జట్టుకు అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టి ఓదార్పు విజయాన్నందించాడు. ఆ వెంటనే టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇక్కడా ప్రత్యర్థి పనిపట్టి గెలిపించాడు. దీంతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడమే మిగిలింది. ఓసారి నట్టూ స్టోరీ ఏంటో చూద్దాం.

మారుమూల గ్రామం:
నటరాజన్‌ది తమిళనాడు సేలం జిల్లాకు 36 కిలోమీటర్ల దూరం ఉన్న చిన్నప్పంపట్టి అనే మారుమూల గ్రామం. తండ్రి రైల్వే హమాలీగా, తల్లి చిరు వ్యాపారిగా కష్టపడుతూ అతడిని పెంచారు. నట్టూ కుటుంబ పరిస్థితి చూస్తే.. అంతర్జాతీయ క్రికెట్ ఆడడం గురించి అసలు ఊహించలేనిది. అలాంటిది క్రికెట్‌పై ఉన్న ప్రేమ అతడిని ఈస్థాయికి తీసుకొచ్చింది. కష్టానికి భయపడని ఆత్మస్థెర్యమే అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా చేసింది. పదేళ్ల క్రితం వరకు నటరాజన్ టెన్నిస్ బాల్‌తోనే స్థానిక మ్యాచ్‌లు ఆడాడు. జయప్రకాశ్ అనే స్నేహితుడు భారత మాజీ వికెట్ కీపర్ భరత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లడంతో నట్టూ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. జోలీ రోవల్స్ క్లబ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తమిళనాడు తరఫున దేశవాళీ క్రికెట్‌లో రాణించాడు.

రూ.40లక్షలకే:
2016-17 టీఎన్‌పీఎల్ సీజన్లో 7 మ్యాచుల్లో 11 వికెట్లు తీసిన నటరాజన్‌పై తమిళనాడు క్రికెట్ సంఘం దృష్టిపెట్టింది. ఆ తర్వాత నటరాజన్ ప్రతిభను గుర్తించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 2017 ఐపీఎల్ వేలంలో అతడిని రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ 6 మ్యాచుల్లో 2 వికెట్లే తీసి 115 పరుగులు ఇవ్వడంతో ఆ తర్వాతి సీజన్‌లో వదిలేసింది. టీఎన్‌పీఎల్‌లో అతడి ప్రతిభను గమనించిన శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 2018 వేలంలో హైదరాబాద్ తరఫున కొనుగోలు చేసేలా కృషి చేశాడు. రూ.40లక్షలకే హైదరాబాద్ కొనుకుంది. అయితే గత రెండేళ్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే అవకాశం టీ నటరాజన్‌కు రాలేదు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 11 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి అదరగొట్టాడు. తమిళనాడుకు డెత్ బౌలర్‌గా ఆవిర్భవించాడు. దీంతో ఈ సీజన్‌లో హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

యార్కర్ స్పెషలిస్ట్‌గా:
ఈ ఏడాది ఐపీఎల్‌లో తుది జట్టులో ఆడే చాన్స్ ఒడిసిపట్టిన నట్టూ.. యార్కర్ స్పెషలిస్ట్‌గా మారిపోయాడు. ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. కీలకమైన చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి.. హైదరాబాద్ నాకౌట్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనే టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. భారత్ తరఫున ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో నటరాజన్ ఆరు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి బౌలర్లంతా విఫలమైన చోట, పరుగుల వరద పారిన సిరీస్‌లో 7లోపే ఎకానమీ నమోదు తన యార్కర్ పదును, వైవిధ్యమైన బౌలింగ్ సత్తా ఏంటో చూపాడు.

వేలంలోకి నటరాజన్ వస్తే:
నట్టూ ప్రదర్శనకు హార్దిక్ పాండ్యా కూడా ముగ్దుడయ్యాడు. 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు నా కన్నా నటరాజనే సరైనోడు' అని ట్రోఫీని హార్దిక్ ఇచ్చేశాడంటే నటరాజన్ ప్రదర్శనను అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా టీమిండియాలో యార్కర్ అంటే జస్ప్రీత్ బుమ్రా అనే పరిస్థితి నుంచి నటరాజన్ కూడా అనే రోజులు వచ్చేశాయి. త్వరలోనే నట్టూ యార్కర్ కింగ్ అని పిలిపించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ నటరాజన్ కీలకం కానున్నాడు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలోకి నటరాజన్ వస్తే అతడి ధర ఏ స్థాయికి వెళుతుందో కూడా ఊహించడం కష్టమే.

తల్లిదండ్రుల కోసం మంచిఇల్లు:
తన గ్రామం నుంచి మరికొంత మంది ఆటగాళ్లు తయారు కావాలనే లక్ష్యంతో చిన్నపాటి క్రికెట్ అకాడమీని తన సొంత ఖర్చుతో నటరాజన్ ఏర్పాటు చేశాడు. సరైన ఆర్థిక వనరులు లేకపోవడంతో.. 20 లీటర్ల క్యాన్‌నే రోలర్లుగా వాడి పిచ్‌లను తయారు చేశాడు. ఐపీఎల్ 2020కు ముందు లాక్‌డౌన్ సమయంలో నట్టూ అక్కడే ప్రాక్టీస్ చేశాడు. ఎంతో మంది యువ క్రికెటర్లు ప్రస్తుతం అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అతడు ఎదగడంతో నటరాజన్ కుటుంబం కష్టాలు కూడా తీరాయి. తల్లిదండ్రుల కోసం మంచిఇల్లు కట్టించాడు. తన సోదరిని ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. మొత్తంగా తన కష్టానికి నటరాజన్ ప్రతిఫలం పొందాడు.
రోహిత్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అధికారిక ప్రకటన.. ఫిట్ అంటూనే..!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications