
ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయమై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శనివారం అధికారిక ప్రకటన చేసింది. శుక్రవారం ఎన్‌సీఏలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ పూర్తి ఫిట్‌గా (క్లినికల్ ఫిట్) ఉన్నాడని తేలిందని బోర్డు ప్రకటించింది. డిసెంబర్ 17 న జరుగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్తారని, 14 రోజుల కరోనా నిర్బంధంలో ఉంటారని బోర్డు ఈరోజు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో హై గ్రేడ్ హ్యామ్ స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురై పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందేందుకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాస ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్‌సీఏలోని వైద్య బృందం రోహిత్ ఫిట్‌నెస్‌పై సంతృప్తి వ్యక్తం చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. సుదీర్ఘ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఆస్ట్రేలియా గడ్డపై ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌ను ముగించుకుని.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.
'టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ బెంగళూరులోని ఎన్‌సీఏలో పునరావాస ప్రక్రియను పూర్తి చేసి వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్నాడు. నవంబర్ 19 నుంచి ఎన్‌సీఏలో పునరావాసం, శిక్షణ పొందుతున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, వికెట్ల మధ్య పరుగులకు సంబంధించిన అతని నైపుణ్యాలను పరీక్షించి.. వివిధ కొలమానాలపై మిస్టర్ శర్మను అంచనా వేసిన తరువాత ఎన్‌సీఏ వైద్య బృందం సంతృప్తి చెందింది' అని బీసీసీఐ పేర్కొంది.
రోహిత్ శర్మ తన సహచరులతో కలిసే ముందు ఆస్ట్రేలియాలో 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంటారు. క్వారంటైన్ సమయంలో రోహిత్ బీసీసీఐ వైద్య బృందం జారీ చేసిన వివరణాత్మక కార్యక్రమాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఆ తరువాత టెస్ట్ సిరీస్‌లో పాల్గొనడంపై తుది నిర్ణయం తీసుకుంటారు. 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత రోహిత్ ఫిట్‌నెస్‌ను తిరిగి అంచనా వేస్తారు. ఫిట్‌నెస్ పూర్తిగా సరిపోతుందని ప్రకటించినట్లయితే చివరి రెండు టెస్టుల్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ డిసెంబర్ 13న ఆస్ట్రేలియాకు బయల్దేరే అవకాశాలున్నాయి.