ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటికే 80 శతకాలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
మాస్టర్ బ్లాస్టర్ 100 శతకాల రికార్డును అందుకునేందుకు అతను మరో 20 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఈ ఒక్క ఏడాదే విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 8 శతకాలు నమోదు చేయడం విశేషం. అది కూడా 34 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ పాత కోహ్లీలా చెలరేగాడు.

ఈ ఏడాది టెస్ట్‌ల్లో రెండు శతకాలు నమోదు చేసిన కోహ్లీ.. వన్డేల్లో 6 సెంచరీలు బాదాడు. వన్డేల్లో 50 శతకాల రికార్డ్‌ను కూడా అందుకున్నాడు. కోహ్లీ తర్వాత 49 శతకాలతో డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్‌తో ఫేర్‌వెల్ సిరీస్ ఆడుతున్న డేవిడ్ వార్నర్.. తొలి టెస్ట్‌లో శతకం బాదాడు. తనపై వచ్చిన విమర్శలకు ఆటతోనే బదులిచ్చాడు.
ఈ ఏడాదే డేవిడ్ వార్నర్ మూడు ఫార్మాట్లలో 37 ఇన్నింగ్స్‌లు ఆడి 4 శతకాలు నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్‌లోనే అతను 3 సెంచరీలు బాదాడు. మూడో స్థానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్ 46 శతకాలతో ఉన్నాడు. ఈ ఏడాది రెండు ఫార్మాట్లలో కలిపి 27 మ్యాచ్‌లు ఆడిన జోరూట్ 27 ఇన్నింగ్స్‌ల్లో 2 శతకాలు బాదాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 45 శతకాలతో ఈ తరం ఆటగాళ్ల సెంచరీల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అతను ఈ ఒక్క ఏడాదే 4 శతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 2 శతకాలు బాదిన రోహిత్.. టెస్ట్‌ల్లో మరో 2 సెంచరీలు బాదాడు. స్టీవ్ స్మిత్ 44 శతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ 42 సెంచరీలు నమోదు చేశాడు.