
యశస్వి.. క్రికెట్ తపస్వి..
ఉండటానికి వసతి లేదు.. తినడానికి తిండి లేదు.. ఆకలితో అలమటిస్తున్నా గుప్పెడు మెతుకులు దొరకని స్థితి. అయినా క్రికెటర్ కావాలనే అతడి సంకల్పం ముందు అవన్నీ బలాదూర్ అన్నాయి. ఆటతోనే ఆకలిని జయించాడు.. పరుగులతోనే దాహాన్ని తీర్చుకుంటున్నాడు. కష్టాల కొలిమిలో కాలినా.. పరిస్థితులు పరీక్షించినా.. ఆత్మస్ఠైర్యంతో వాటిని ఎదురించి.. ఆటే ఆశగా, శ్వాసగా.. క్రికెట్ తపస్విగా మారాడు ఈ ఉత్తర ప్రదేశ్ కుర్రాడు యశస్వి.
11 ఏళ్ల వయసు... కానీ పెద్ద క్రికెటర్ కావాలనేది కల. అది నెరవేర్చుకోవాలంటే స్వస్థలం భదోహీ (ఉత్తర ప్రదేశ్)లో మాత్రం సాధ్యం కాదు. అందుకే దేనికైనా సిద్ధం అంటూ 'చలో ముంబై' అన్నాడు. సొంతూర్లో తండ్రిది చిన్న కిరాణా కొట్టు. ఇద్దరు పిల్లల పోషణ కూడా ఆయనకు భారంగా అనిపించి నీ ఇష్టం అనేశాడు. మామయ్య వరుసయ్యే దూరపు బంధువొకరు ముంబైలో ఉంటే ఆయనను నమ్ముకొని బయల్దేరాడు.

టెంట్‌లోనే నివాసం..
అయితే అతని ఇల్లు మాత్రం రెండో మనిషికి అవకాశమే లేనంత చిన్నది. దీంతో డెయిరీ దుకాణంలో పనికి కుదిర్చి అక్కడే ఉండే ఏర్పాటు చేశాడు. అయితే రోజంతా పనికంటే క్రికెట్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో డైరీ వారు పనిలో నుంచి పంపించేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మళ్లీ అదే బంధువు ఆదుకుంటూ తాను పని చేస్తున్న 'ముస్లిం యునైటెడ్ క్లబ్' క్రికెట్ గ్రౌండ్‌లో ఒక మూలన ఉండే టెంట్‌లో ఆ అబ్బాయిని ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు.
కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచిన ఆ టెంటే అప్పటి నుంచి యశస్వి నివాసమైపోయింది. స్థానికంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం, యునైటెడ్ క్లబ్‌కు సంబంధించి గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. తనకంటే వయసులో పెద్దవారితో క్రికెట్ మ్యాచ్‌లు ఆడితే 200-300 రూపాయలు వచ్చేవి. వాటినే ఎంతో పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది.

పానీ పూరీ అమ్మాడు..
ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో రామ్‌లీలా ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరిగే సమయంలో యశస్వి పానీ పూరీలు కూడా అమ్మేవాడు! తనతో ఆడే కుర్రాళ్లను ఆ సమయంలో పానీపూరీ తినేందుకు తన వద్దకు రావద్దని వేడుకునే వాడు. టెంట్‌లో ఉంటున్న సమయంలో తాను ఆకలితో పడుకున్న రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్ కావాలనే తన లక్ష్యానికి మాత్రం వదులుకోలేదు.

జ్వాల కంట పడడంతో..
యశస్వి గాథలు ఆజాద్ మైదాన్‌లో చాలా మందికి చేరాయి. సహజ ప్రతిభావంతుడైన ఒక కుర్రాడిని అండగా నిలవాల్సిన అవసరం తెలిసింది. వీరిలో ఒక స్థానిక కోచ్ జ్వాలా సింగ్ అందరికంటే ముందుగా స్పందించాడు. యశస్విలాంటి నేపథ్యంతోనే అదే ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి పెద్ద స్థాయికి చేరలేకపోయిన జ్వాలా సింగ్‌కు బహుశా అతనిలో తన ప్రతిరూపం కనిపించి ఉంటుంది! అందుకే ఈ కుర్రాడిని చేరదీసి ఆటను తీర్చిదిద్ది ముందుకు నడిపించాడు. అతని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లిన యశస్వి స్థానిక లీగ్‌లలో పరుగుల వరద పారించాడు.
అన్ని స్థాయిల మ్యాచ్‌లలో కలిపి అతను దాదాపు 50 సెంచరీలు బాదాడు. వేర్వేరు వయో విభాగాల్లో ఈ అసాధారణ ప్రదర్శన అతనికి ముంబై అండర్-19 జట్టులో, ఆ తర్వాత భారత అండర్-19 జట్టులో చోటు కల్పించింది. విజయ్ హజరే డుబల్ సెంచరీ కోటీశ్వరుడినీ చేసింది. ఐపీఎల్ కనక వర్షం కురిపించింది. రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్‌ను అతని కనీస ధరకంటే 12 రెట్లు ఎక్కువ పెట్టి రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ డబ్బుకు యశస్వీ ఈ సీజన్ సెకండాఫ్‌లో న్యాయం చేస్తున్నాడు.

సిగ్గు లేకుండా అడుక్కునే వాడిని..
ఆకలిని తట్టుకులేక అడక్కొని కడుపు నింపుకున్నానని ఈ యంగ్ సెన్సెషన్ ఓ ఇంటర్వ్యూలో తన ధీన స్థితిని చెప్పుకొచ్చాడు. 'మ్యాచ్‌లు ఆడేటప్పుడు లంచ్ విరామం సమయంలో నా సహచరులు, వాళ్ల తల్లిదండ్రులు మంచి భోజనాలు తీసుకు వచ్చేవారు. నాకు బ్రేక్ ఫాస్ట్ అనేది ఉండేది కాదు. వాళ్లలోనే ఎవరో ఒకరిని బతిమాలి కడుపు నింపుకునేవాడిని. ఈ విషయంలో నేను ఏ మాత్రం సిగ్గు పడకపోయేవాడిని. 'డబ్బులు లేవు కానీ ఆకలి మాత్రం ఉంది' అని ఏ మాత్రం సిగ్గు పడకుండా అడిగి తినే వాడిని. ఈ పరిస్థితిల్లో చాలా సార్లు నా తల్లి దండ్రులు గుర్తుకొచ్చి ఏడుస్తూ కుమిలిపోయేవాడిని.

ఒత్తిడంటే తెలియదు.. తిండి గురించే బెంగ..
వేసవిలో ప్లాస్టిక్ టెంట్‌లో పడుకున్నప్పుడు వేడితో చచ్చిపోయేవాడిని. దాంతో గ్రౌండ్‌లోనే పడుకునేందుకు సిద్ధమైపోయా. అయితే ఒక రాత్రి ఏదో పురుగు కుట్టి కన్ను వాచిపోయింది. దాంతో ఎంత వేడి ఉన్నా టెంట్‌లోనే పడుకునే వాడిని. క్రికెట్‌లో ఒత్తిడి అనే మాటే నాకు తెలీదు. ఎన్నో ఏళ్లుగా రోజూ అనుభవించిన వాడిని కాబట్టి ఆటలో నాకు ఎలాంటి ఒత్తిడి అనిపించేది కాదు.
బరిలోకి దిగితే పరుగులు చేయగలనని నమ్మకం ఉండేది కానీ ఆ రోజు భోజనం దొరుకుతుందా లేదా అనే దాని గురించే ఆందోళన చెందినవాడిని.' అని యశస్వి జైస్వాల్ తన ధీన గాథను ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో సత్తా చాటుతున్న యశస్వి ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే అతి త్వరలోనే భారత జట్టుకు ఆడనున్నాడు. వచ్చే ఏడా మెగా వేలం ఉన్న నేపథ్యంలో అతను భారీ ధర పలికే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
