IND vs AFG: యశస్వి శతకం.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోను అఫ్గాన్‌ను చిత్తుగా ఓడించింది. చెన్నై వేదికగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
యశస్వి జైస్వాల్(86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 110 నాటౌట్) అజేయ శతకానికి రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీ తోడవడంతో 128 బంతులు మిగిలి ఉండగానే 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది.
హష్మతుల్లా సెంచరీ బాదినా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 218 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(131 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 102) సెంచరీతో చెలరేగగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(56 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ ఐదు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 28.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 221 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మకు తోడుగా శ్రేయస్ అయ్యర్(20 నాటౌట్) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ(1/47) ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
యశస్వి విధ్వంసం..
219 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 10 పరుగుల వ్యక్తి స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అఫ్గాన్ ఆటగాళ్లు అందుకోలేకపోయారు. ఈ అవకాశాన్ని రోహిత్ శర్మ సద్వినియోగం చేసుకున్నాడు.
అతను ఆచితూచి ఆడినా.. యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. గత మ్యాచ్‌లో విఫలమైనా.. ఈ మ్యాచ్‌లో చెలరేగి రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 38 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 47 బంతుల్లో రోహిత్ శర్మ అర్థశతకాన్ని అందుకున్నాడు.
సిక్సర్‌తో సెంచరీ..
హాఫ్ సెంచరీ అనంతరం ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదారు. సెంచరీ దిశగా సాగిన రోహిత్ శర్మను మహమ్మద్ నబీ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 170 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ రాగా.. సిక్సర్ సాయంతో యశస్వి జైస్వాల్ 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో యశస్వి జైస్వాల్‌కు ఇది రెండో సెంచరీ. ఆ తర్వాత వరుసగా 4, 6 బాదిన యశస్వి జైస్వాల్ భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

