ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును రవీంద్ర జడేజా నడిపించనున్నాడు. సంజూ శాంసన్‌కు బదులుగా రవీంద్ర జడేజాను ట్రేడింగ్ స్వాప్ డీల్ ద్వారా చెన్నైసూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ట్రేడింగ్ స్వాప్ డీల్‌పై అధికార ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ఈ ఒప్పందం పూర్తయినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.
సంజూ శాంసన్‌కు బదులుగా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్‌ను తీసుకుంటుంది. సంజూ శాంసన్, రవీంద్ర జడేజా ఐపీఎల్ వేతనం రూ. 18 కోట్లు. కాబట్టి ఈ ఇద్దరి స్వాప్ డీల్ సులువుగా పూర్తయ్యింది. కానీ సామ్ కరణ్ ధర రూ. 2.40 కోట్లు. ఈ డబ్బును రాజస్థాన్ రాయల్స్ సీఎస్‌కేకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రాజస్థాన్ రాయల్స్ పర్స్ వాల్యూలో నుంచి రూ. 2.40 కోట్లు కట్ చేసి.. సీఎస్‌కే పర్స్ వాల్యూలో కలుపుతారు.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఓవర్‌సీస్ ప్లేయర్ల కోటా ఎక్కువగా ఉందని, దాంతో ఈ స్వాప్ డీల్‌పై అధికారిక ప్రకటన ఆలస్యమైందని క్రిక్‌బజ్ పేర్కొంది. సంజూ శాంసన్.. రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడటంతో ఆ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతుంది. యువ ప్లేయర్లు అయిన యశస్వి జైస్వాల్‌తో పాటు ధ్రువ్ జురెల్ రేసులో ఉన్నారని ప్రచారం జరిగింది. గత సీజన్‌లో సంజూ శాంసన్ గైర్హాజరీలో జట్టును నడిపించిన రియాన్ పరాగ్‌కు కూడా సారథ్య బాధ్యతలు ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ వీటికి యశస్వి జైస్వాల్ ఒక్క ఫొటోతో బదులిచ్చాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి దిగిన సెల్ఫీని జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరిగే తొలి టెస్ట్‌కు ఈ ఇద్దరు సిద్దమవుతున్నారు. ఈ సందర్భంగా టీమ్ బస్‌లో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఓవైపు ట్రేడ్ డీల్ సంబంధించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫొటో షేర్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
రవీంద్ర జడేజానే తమ తదుపరి కెప్టెన్ అనే విషయాన్ని యశస్వి జైస్వాల్ పరోక్షంగా వెల్లడించాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కెప్టెన్సీ ఆఫర్ నేపథ్యంలోనే ఈ స్వాప్ డీల్‌కు జడేజా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎస్‌కే కెప్టెన్‌గా జడేజా రాణించలేకపోయాడు. దాంతో అతనిపై వేటు వేసిన సీఎస్‌కే యాజమాన్యం రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి అతను అసంతృప్తితో రగిలిపోతున్నాడనే ప్రచారం ఉంది.