సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. వైజాగ్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డికాక్(89 బంతుల్లో 6 ఫోర్లతో 106) సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా(67 బంతుల్లో 5 ఫోర్లతో 48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ నాలుగేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 44 ఓవర్లలో వికెట్ నష్టానికి పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(116 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 107) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), రోహిత్ శర్మ(73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే వికెట్ తీయగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

271 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ జోడీ ఆ తర్వాత తమదైన శైలిలో చెలరేగింది. ముఖ్యంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన జైస్వాల్.. ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. అనంతరం రోహిత్ దూకుడు కనబర్చగా.. జైస్వాల్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. 54 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించగా.. యశస్వి జైస్వాల్ 75 బంతుల్లో అర్థ శతకం అందుకున్నాడు.
హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ ఔటవ్వగా.. కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాడు. జైస్వాల్ కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత పోటా పోటీగా పరుగులు రాబట్టిన ఈ జోడీ..61 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. కార్బిన్ బోష్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా విరాట్ కోహ్లీ కొట్టిన నో లుక్ సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.