వెస్టిండీస్‌తో సెకండ్ టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సెకండ్ డే రెండో ఓవర్‌లోనే ఓవర్‌నైట్ బ్యాటర్, సెంచరీ హీరో యశస్వి జైస్వాల్(258 బంతుల్లో 22 ఫోర్లతో 175) దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సమన్వయలోపం కారణంగా జైస్వాల్ వెనుదిరిగాల్సి వచ్చింది. జైడన్ సీల్స్ వేసిన 92వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ రెండో బంతిని మిడాఫ్ దిశగా ఆడిన జైస్వాల్ క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే జైస్వాల్‌కు మూమెంటమ్ ఇచ్చిన గిల్.. బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో ఆగిపోయాడు. మరోవైపు ఇది చూసుకోకుండా యశస్వి జైస్వాల్ సగం క్రీజును ధాటేసాడు. శుభ్‌మన్ గిల్ రాకపోవడాన్ని గమనించి యూటర్న్ తీసుకొని పరుగెత్తాడు. కానీ బంతిని అందుకున్న వికెట్ కీపర్ ఎలాంటి తప్పిదం చేయకుండా బెయిల్స్ పడేసాడు. దాంతో జైస్వాల్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది.

25 పరుగుల దూరంలో డబుల్ సెంచరీ చేజారడంతో జైస్వాల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. శుభ్‌మన్ గిల్‌తో వాగ్వాదానికి దిగాడు. 'ఇది నా కాల్ కాదా?'అంటూ అసహనం వ్యక్తం చేశాడు. శుభ్‌మన్ గిల్ పరుగెత్తి ఉంటే సింగిల్ పూర్తయ్యేదని, ఒకవేళ రనౌట్ అయినా జైస్వాల్ అయ్యేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
శుభ్‌మన్ గిల్ తప్పిదం కారణంగా యశస్వి జైస్వాల్ ద్విశతకం చేజారిందని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కామెంటేటర్లు మాత్రం అనసవర పరుగుకు ప్రయత్నించి జైస్వాల్ మూల్యం చెల్లించుకున్నారని అభిప్రాయపడ్డారు. అక్కడ పరుగే అవసరం లేదని తెలిపారు. బంతిని చూస్తూ పరుగెత్తాలనేది బేసిక్ రూల్ అని, గిల్ అదే చేశాడని అన్నారు.
యశస్వి జైస్వాల్ రనౌట్‌తో మూడో వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఓవర్‌నైట్ స్కోర్ 318కి 7 పరుగులు మాత్రమే జోడించి మూడో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(10 బ్యాటింగ్) రాగా.. శుభ్‌మన్ గిల్(43 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. యశస్వి జైస్వాల్‌తో పాటు సాయి సుదర్శన్(165 బంతుల్లో 12 ఫోర్లతో 87) హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్(2/60) రెండు వికెట్లు పడగొట్టాడు.