ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఆసియాకప్ 2025కు దూరం కానున్నాడు. టీ20ల్లోకి తీసుకోలేమని, టెస్ట్ క్రికెట్‌పై మరింత ఫోకస్ పెట్టాలని జైస్వాల్‌కు సెలెక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. అంతేకాకుండా ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా ఆసియాకప్ జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవని సదరు అధికారి స్పష్టం చేశారు.
భారత్ తరపున ఇప్పటి వరకు 23 టీ20లు ఆడిన జైస్వాల్ 723 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ 14 మ్యాచ్‌ల్లో 559 పరుగులతో రాణించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.ఇంగ్లండ్ గడ్డపై కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో యశస్వి జైస్వాల్‌ను ఆసియాకప్‌కు ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చడంతో పాటు బ్యాటర్‌గానూ సత్తా చాటిన అయ్యర్ కూడా టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ జట్టులో తీవ్ర పోటీ ఉండటంతో రెడ్ బాల్ క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టాలని యశస్వి జైస్వాల్‌కు సెలెక్టర్లు ముఖం మీదనే చెప్పినట్లు తెలుస్తోంది.
'భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కడమే కష్టంగా మారింది. ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చిన యశస్వి జైస్వాల్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు కూడా టీ20 జట్టులో చోటు లేదు. ఇప్పటికే జైస్వాల్‌తో సెలెక్టర్లు మాట్లాడారు. రెడ్ బాల్ క్రికెట్‌పై మరింత ఫోకస్ పెట్టాలని చెప్పారు.'అని సదరు అధికారి తెలిపారు.
ఆసియాకప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 మధ్య యూఏఈ వేదికగా జరగనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో బిగ్ మ్యాచ్ ఆడనుంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఆసియా కప్ బరిలోకి దిగే భారత జట్టును ఆగస్ట్ 19న ముంబైలో ప్రకటించే అవకాశం ఉంది. భారత సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో జట్టు వివరాలను వెల్లడించనున్నారు. 'ఆసియాకప్ బరిలోకి దిగే భారత జట్టును ఆగస్ట్ 19న ముంబైలో ప్రకటించనున్నారు. సెలెక్షన్ కమీటి ఛైర్మన్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించి జట్టు వివరాలను వెల్లడించనున్నారు.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఈ జట్టు ఎంపిక సమావేశంలో పాల్గొననున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న సూర్య.. ముంబైకి వెళ్తాడని, అతనే భారత జట్టుకు సారథ్యం వహిస్తాడని కూడా సదరు అధికారి వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో టీమిండియా చివరి టీ20 మ్యాచ్ ఆడింది. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(54 బంతుల్లో 135) సెంచరీతో చెలరేగాడు.