Yashasvi Jaiswal: తిండికి గతి లేనోడు.. ఆటే ఆశగా, శ్వాసగా..!
హైదరాబాద్: ఉండటానికి వసతి లేదు.. తినడానికి తిండి లేదు! ఆకలితో అలమటిస్తున్నా.. గుప్పెడు మెతుకులు దొరకని స్థితి. అయినా క్రికెటర్ కావాలనే అతడి సంకల్పం ముందు అవన్నీ బలాదూర్ అన్నాయి. ఆటతోనే ఆకలిని జయించాడు! పరుగులతోనే దాహాన్ని తీర్చుకుంటున్నాడు. కష్టాల కొలిమిలో కాలినా.. పరిస్థితులు పరీక్షించినా.. ఆత్మస్థైర్యంతో వాటిని ఎదురించి.. ఆటే ఆశగా, శ్వాసగా బతికి క్రికెట్ తపస్విగా మారాడు యూపీ కుర్రాడు యశస్వి జైస్వాల్!
అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 17వ భారత బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ రికార్డుకెక్కాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అసలు సిసలు టెస్ట్ ఫార్మాట్ బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ స్థాయికి చేరుకోవడానికి యశస్వి జైస్వాల్ తన విధిరాతతోనే పోరాటం చేశాడు.

లక్ష్యసాధన కోసం ఇల్లు వదిలి..:11 ఏళ్ల వయసులో క్రికెటర్ కావాలనే లక్ష్యంతో స్వస్థలం భదోహీ (ఉత్తర ప్రదేశ్) నుంచి ముంబైకి వచ్చాడు. సొంతూర్లో తండ్రిది చిన్న కిరాణా కొట్టు. ఇద్దరు పిల్లల పోషణ భారంగా ఉండటంతో ఆయన కూడా జైస్వాల్‌కు అడ్డు చెప్పలేదు. మామయ్య వరుసయ్యే దూరపు బంధువు ఒకరు ముంబైలో ఉంటే ఆయనను నమ్ముకొని బయల్దేరాడు.
కానీ అతని ఇల్లు రెండో మనిషికి అవకాశమే లేనంత చిన్నది. దీంతో డెయిరీ దుకాణంలో పనికి కుదిర్చి అక్కడే ఉండే ఏర్పాటు చేశాడు. అయితే రోజంతా పనికంటే క్రికెట్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో డైరీ వారు జైస్వాల్‌ను పనిలో నుంచి పంపించేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
మళ్లీ అదే బంధువు ఆదుకుంటూ తాను పని చేస్తున్న 'ముస్లిం యునైటెడ్ క్లబ్' క్రికెట్ గ్రౌండ్‌లో ఒక మూలన ఉండే టెంట్‌లో ఆ అబ్బాయిని ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచిన ఆ టెంటే అప్పటి నుంచి యశస్వి నివాసమైపోయింది.

స్థానికంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం, యునైటెడ్ క్లబ్‌కు సంబంధించి గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. తనకంటే వయసులో పెద్దవారితో క్రికెట్ మ్యాచ్‌లు ఆడితే 200-300 రూపాయలు వచ్చేవి. వాటినే ఎంతో పొదుపుగా వాడుకునేవాడు.
పానీపూరి అమ్మేవాడు..:ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో రామ్‌లీలా ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరిగే సమయంలో యశస్వి పానీ పూరీలు కూడా అమ్మేవాడు.ఇక టెంట్‌లో ఉంటున్న సమయంలో తాను ఆకలితో పడుకున్న రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్ కావాలనే తన లక్ష్యానికి మాత్రం యశస్వి వదులుకోలేదు.
ఆ కోచ్ కంట పడటంతో..:యశస్వి ధీన గాథ ఆజాద్ మైదాన్‌లోని చాలా మందికి చేరింది. సహజ ప్రతిభావంతుడైన ఒక కుర్రాడిని అండగా నిలవాల్సిన అవసరం తెలిసింది. వీరిలో ఒక స్థానిక కోచ్ జ్వాలా సింగ్ అందరికంటే ముందుగా స్పందించాడు. యశస్విలాంటి నేపథ్యంతోనే అదే ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి పెద్ద స్థాయికి చేరలేకపోయిన జ్వాలా సింగ్‌కు బహుశా అతనిలో తన ప్రతిరూపం కనిపించి ఉంటుంది.
అందుకే ఈ కుర్రాడిని చేరదీసి ఆటను తీర్చిదిద్ది ముందుకు నడిపించాడు. అతని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లిన యశస్వి స్థానిక లీగ్‌లలో పరుగుల వరద పారించాడు. ఏజ్ క్రికెట్‌తో పాటు అండర్ 19 ప్రపంచకప్‌లోనూ దుమ్మురేపాడు. పాకిస్థాన్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ ప్రదర్శనతో ఐపీఎల్ వేలంలో భారీ ధరను అందుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్.. యశస్వి జైస్వాల్‌ను రూ.2.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆరంభంలో విఫలమైనా.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం నిలకడగా రాణించాడు. డబుల్, ట్రిపుల్ సెంచరీలతో చెలరేగాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో తన అసలు సిసలు సత్తాను చూపించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి అంతర్జాతీయ క్రికెట్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.
ఇదే జోరును కొనసాగిస్తే యశస్వి ఆల్‌ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదగనున్నాడు. లెఫ్టాండర్ కావడం అతనికి అదనపు బలం. గత కొద్ది కాలంగా జట్టులో లెఫ్టాండర్స్ లేక టీమిండియా ఇబ్బంది పడుతోంది. యశస్వికి ఇంత త్వరగా అవకాశం రావడానికి కూడా ఇదే ప్రధాన కారణం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications