అతని వల్లే ఈ శతకం.. ప్రశ్నలతో విసిగించాను: యశస్వి జైస్వాల్
రోహిత్ శర్మ సహకారంతోనే సెంచరీ చేయగలిగానని టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్నాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ప్రశ్నలతో విసిగించానని, రోహిత్ భయ్యా ఓపికగా తనకు సూచనలు ఇచ్చాడని తెలిపాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్(86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 110 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.
సాయశక్తులా ప్రయత్నిస్తా..
ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన యశస్వి జైస్వాల్.. రోహిత్ శర్మ సూచనలతోనే ఈ శతకం సాధ్యమైందని చెప్పాడు.ఈ ఇన్నింగ్స్‌ను తాను ఎంతగానో ఆస్వాదించానని వెల్లడించాడు. 'ఈ ఇన్నింగ్స్‌ను నేను చాలా ఆస్వాదించాను. పవర్‌ప్లేలోనే నాకు కొన్ని పరుగులు వచ్చాయి. దాంతో ఆ జోరును కొనసాగిస్తూ చివరి వరకు క్రీజులో ఉండాలనుకున్నాను.

అందుకే ఈ ఇన్నింగ్స్‌ను చాలా ఎంజాయ్ చేశాను. నేను నా విధానంపై, నా నియంత్రణలో ఉన్న విషయంపై మాత్రమే ఫోకస్ పెడుతాను. నా సాయశక్తులా కష్టపడటానికి ప్రయత్నిస్తాను. మా సపోర్ట్ స్టాఫ్ నుంచి కూడా నాకు మద్దతు లభిస్తుంది. సపోర్ట్ స్టాఫ్‌తో నా కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో నాకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే నేను ఈ ఇన్నింగ్స్‌ను బాగా ఆస్వాదించాను.
అది నా అదృష్టం..
నాకు లభించిన మంచి ఆరంభాలను శతకాలుగా మల్చడం అదృష్టమనే చెప్పాలి. నాకు మంచి ఆరంభం లభిస్తే దాన్ని భారీ స్కోరుగా మార్చడానికే ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ , ముఖ్యంగా క్రికెట్‌లో మనకు కలిసి వచ్చిన రోజును పూర్తిగా ఉపయోగించుకోవాలి. నేను అదే చేయడానికి ప్రయత్నిస్తాను.
ఎందుకంటే ఇటీవల నాకు ఒక అనుభవం ఎదురైంది.. నేను ఎంత ప్రయత్నించినా విషయాలు నాకు అనుకూలంగా జరగలేదు. కానీ ఈరోజు మాత్రం నేను చాలా పట్టుదలగా ఉన్నాను. ఎలాగైనా నా దృష్టిని కోల్పోకూడదని, స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఉండాలని అనుకున్నాను. క్రీజులో సెట్ అయిన తర్వాత, దాన్ని భారీ స్కోరుగా మార్చాలనుకున్నాను.
రోహిత్ భాయ్‌ని విసిగించా..
రోహిత్ భయ్యా ఎల్లప్పుడూ నాకు సహాయం చేస్తారు. నేను ఆయనను ఎప్పుడూ చాలా ప్రశ్నలు అడుగుతుంటాను. ఆయన సూచనలను మ్యాచ్‌లో అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు కూడా నేను కొన్ని డాట్ బాల్స్ ఆడినప్పుడు.. 'ఇప్పుడు నేను ఏం చేయాలి?' అని ఆయనను అడిగాను. దానికి ఆయన 'స్ట్రైక్ రొటేట్ చేయడానికి ప్రయత్నించు.
నీ ఇంటెంట్ మాత్రం మారకూడదు' అని చెప్పారు. నేను కూడా అదే ఇంటెంట్‌తో ఉంటూ స్ట్రైక్ రొటేట్ చేశాను. అది నాకు ఎంతగానో సహాయపడింది. ఆయనతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. ఈ ఇన్నింగ్స్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది.'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

